ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది. తాము దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పధకాలను అందిస్తున్నామని వైసీపీ మంత్రులు నేతలు ఎపుడూ చెప్పుకుంటారు. సంక్షేమం మీద విపక్ష తెలుగుదేశం తో పాటు జనసేన కూడా ఈ మధ్య దాకా విమర్శించాయి.
ఇపుడు యూ టర్న్ తీసుకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఇంతకు మించిన సంక్షేమ పధకాలు అందిస్తామని చెబుతున్నారు. పవన్ సైతం ఇటీవల సంక్షేమ పధకాలను జనసేన అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇలా జగన్ సంక్షేమాన్ని ఎవరూ ఇపుడు ఏమీ అనలేని పరిస్థితి ఉంది. విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వ సంక్షేమ పధకాలను బాగానే ఉన్నాయని అంటున్నారు.
సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయల్సిందే అని ఆయన అన్నారు. అమెరికా లాంటి దేశం కూడా కోవిడ్ సమయంలో ఒక్కో కుటుంబానికి భారీ ఆర్ధిక సాయం చేసిందని గుర్తు చేశారు. సంక్షేమ పధకాలు పేదరికం నుంచి బయటకు తేవడానికే అని అన్నారు.
అదే విధంగా జగన్ ప్రభుత్వం పని తీరు మీద తాను అభిప్రాయం చెప్పడం కంటే 2024 ఎన్నికల్లో ప్రజలు చెబుతారు అని ఆయన అన్నారు. ప్రజలు వివేకవంతులని ఆయన అంటూ వారి తీర్పు ఎవరికైనా శిరోధార్యం అన్నారు. ఏపీలో జగన్ సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రం జేడీ మాటలు సంచలనంగానే ఉన్నాయి.