Advertisement

Advertisement


Home > Politics - Analysis

పార్టీ మారాడు ....టీవీ ఛానల్ స్వరం మారింది!

పార్టీ మారాడు ....టీవీ ఛానల్ స్వరం మారింది!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మీడియా ( పత్రికలు అండ్ టీవీ చానళ్లు) అంతా అంటే ఎక్కువభాగం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అధికారంలో ఉన్న వారికీ మీడియా ఉంది. అధికారంలో లేనివారికీ మీడియా ఉంది. కొందరు రాజకీయ నాయకులకు సొంత మీడియా ఉంటే, కొందరు నాయకులకు పరోక్షంగా సపోర్ట్ ఇచ్చే మీడియా ఉంది. ఏది ఏమైనా మీడియా ఉందా లేదా అనేదే ప్రధానం. ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే కొందరు రాజకీయ నాయకులు ఆల్రెడీ ఉన్న పత్రికలను, టీవీ చానళ్లను కొనుక్కుంటున్నారు. వాటిని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు.

ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు కొనుక్కున్న టీవీ ఛానల్ రాత్రికి రాత్రి ఉన్నట్లుండి తన స్వరం మార్చింది. ఆ నాయకుడు చేరిన పార్టీకి భజన మొదలుపెట్టింది. గతంలో ఆ నాయకుడు టీవీ ఛానల్ ను ఒక నాయకుడి కోసమే కొన్నాడు. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే కొన్నాడు. ఆ ఛానల్ కొన్న రాజకీయ నాయకుడు వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు కాదు. పూర్వాశ్రమంలో ఐఏఎస్ అధికారి. తరువాత రాజకీయ నాయకుడిగా మారాడు. ఆర్ధికంగా బలమున్నవాడు. ఆయన పేరు తోట చంద్రశేఖర్. ఆయన కొన్న టీవీ ఛానల్ పేరు "టీవీ 99 " అంతకుముందు అది సీపీఐ పార్టీకి చెందింది.

వాళ్లకు నడపడం చేతగాక తోట చంద్రశేఖర్ కు అమ్మేశారు. ఆయన ఎవరి కోసం కొన్నాడు? జనసేన పార్టీ కోసం. అంటే ఆ పార్టీని, అధినేత పవన్ కళ్యాణ్ కు వెన్నుదన్నుగా ఉండటంకోసం. పవన్ పార్టీ జనసేనకు గత కొన్నేళ్లుగా సపోర్టుగా నిలిచిన ఏకైక మీడియా చానల్99 టీవీ. కానీ ఇన్నాళ్లూ లేనిది.. రాత్రికి రాత్రే అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవన్ పేరెత్తకుండా రోజు గడవదన్న రేంజ్ లో ఉన్న ఆ చానల్ సడెన్ గా స్వరం మార్చింది. కారణం ఏమిటంటే కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆంధ్రాలోకి అడుగుపెట్టడమే. ఆ పార్టీలో తోట చంద్రశేఖర్ చేరడమే. దానికి ఆయన ఏపీ శాఖకు అధ్యక్షుడు కాబోతుండటమే. 2014 నుంచి చానల్ నడుస్తున్నా.. కొందరికే సుపరిచితం. 

అది కూడా పవన్ కళ్యాణ్ కు కవరేజీ ఇస్తుండడంతో ప్రత్యేక వీక్షకులను సొంతం చేసుకుంది. అయితే ఇది జనసేన అధికార మీడియా చానల్ అని అందరూ భావిస్తారు. గత కొన్నేళ్లుగా ఆ చానల్ వ్యవహారం కూడా అలానే ఉంది. 2014లో న్యూ వేవ్స్ మీడియా పేరిట ఈ చానల్ ను చంద్రశేఖర్ రిజస్టర్ చేశారు. మహారాష్ట్ర కేడర్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తరువాత తన గాలి రాజకీయాల వైపు సోకింది. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీగా 2009లో హేమాహేమీలతో తలపడ్డారు. కానీ ఓటమే ఎదురైంది. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. 

అయితే చేతిలో మీడియా ఉంటే గుర్తింపు ఉంటుందన్న భావనతో 99 టీవీ చానల్ ను ఏర్పాటుచేశారు. కానీ అప్పటికే మీడియా సపోర్టు ఉన్న జగన్ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఆఫర్ తో బీఆర్ఎస్ లో చేరారు. ఛానల్ గొంతు మార్చారు. అయితే ఇలా బీఆర్ఎస్ ఆఫర్ వచ్చిందో లేదో… తన 99 టీవీ చానల్ స్ట్రాటజీనే మార్చేశారు. అప్పటివరకూ పవన్ తారకమంత్రం పఠించిన సదరు చానల్ పై ఇప్పుడు కేసీఆర్ మెరిసిపోతున్నారు. 

దాని పక్కన తోట చంద్రశేఖరం ఫొటో పెట్టి వండి వార్చుతున్న కథనాలు చూసి జనసైనికులు కూడా అదే స్థాయిలో రియాక్టు అవుతున్నారు. ఉన్నట్టుండి చానల్ ప్లేట్ ఫిరాయించడంతో షాక్ కి గురయ్యారు. కేవలం వ్యూయర్ షిప్ కోసం జనసేన, పవన్ ను చూపించి వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత టీవీ చానల్ జాబితాలో 99 టీవీని కూడా చేర్చుతున్నారు. అయితే ఇప్పుడు జనసేనకు వచ్చే ప్రమాదమేదీ లేదు. 99 టీవీకి ఉన్న ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అటు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎంత మీదకు లేపినా కుదిరే పనికాదని కూడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?