అమరావతి ఉద్యమ డ్రామా రక్తి కట్టించలేకపోతోంది. దీనికి కారణం ఆ ఉద్యమంలో చిత్తశుద్ధి కొరవడడమే. ముఖ్యంగా అమరావతిలో ఆందోళన కార్యక్రమాలు పబ్లిసిటీ స్టంట్లగా మారిపోయాయి. ఇందుకు వాళ్లే బాధ్యులు. అమరావతి రైతులపై సానుభూతి చూపాలనుకుంటున్న వాళ్ల ఆదరణ కూడా రోజురోజుకూ కరువవుతోంది. ఈ ఆందోళనలు రాజకీయ కార్యకలాపాలుగా టర్న్ తీసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చింది.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 29 గ్రామాలకు చెందిన మెజార్టీ రైతులు, మహిళలు, రియల్టర్ల సాగిస్తున్న ఆందోళన గురువారానికి 247వ రోజుకు చేరింది. మరో మూడు రోజుల్లో 250వ రోజుకు ఆందోళన చేరుకోనుంది. ఈ సందర్భంగా 23వ తేదీ వినూత్న కార్యక్రమం చేపట్టాలని అమరావతి జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా ఈ నెల 23న “రాజ్యాంగాన్ని గౌరవిద్దాం…అమరావతిని కాపాడుకుందాం” నినాదంతో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలుపుతామని శివారెడ్డి తెలిపారు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాదనలేరు. దీన్ని అందరూ స్వాగతించాల్సిందే. అమరావతి రైతుల డిమాండ్‌తో ఏకీభవించని ఆ 29 గ్రామాలు మినహాయించి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా వారి ఆకాంక్షలను గౌరవిస్తాయి. అయితే సమస్యల్లా ఎక్కడంటే…పబ్లిసిటీ స్టంట్లపైనే.
అమరావతి రైతులు, మహిళలు తమ నిరసనలో భాగంగా బుధవారం మాట్లాడిన మాటలను ఒకసారి పరిశీలిద్దాం.
“మా గోడును పట్టించుకునే నాథుడు లేనప్పుడు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం కూడా లేనప్పుడు తీవ్రవాదుల్లో కలవడమే ఉత్తమమనుకుంటున్నాం. ఈ విషయమై అనుమతి కోసం మేము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాస్తాం”….అని హెచ్చరించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒక వైపు సుప్రీంకోర్టులోనూ తామే గెలుస్తామని చెబుతున్నారు. 23వ తేదీన రాజ్యాంగాన్ని గౌరవిద్దామంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించడానికి ప్లాన్ రెడీ చేశారు.
మరోవైపు తీవ్రవాదుల్లో కలిసిపోతామని ప్రకటించడం, అందుకోసం రాష్ట్రపతి అనుమతి కోసం లేఖలు రాస్తామని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మీడియాలో ప్రచారం కోసం కాదా? అసలు అమరావతి రైతులకు న్యాయం కావాలా? ప్రచారం కావాలా? ఈ రెండింటిలో ఏది కావాలో ముందు వారు తేల్చుకోవాల్సి వుంది.
తీవ్రవాదుల్లో చేరే వాళ్లంతా రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, న్యాయస్థానాల అనుమతి తీసుకొని వెళుతున్నారా? టీడీపీ ట్రాప్‌లో ఇరుక్కుని ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో చులకన కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. తాము నమ్ముకున్న చంద్రబాబు చేసేది కూడా ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి నడుచుకుంటే అమరావతి రైతులకే మంచిది.