మహాభారతంలో విరాట కొలువులో ద్రౌపదిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుడి గురించి కథలుకథలుగా చెప్పుకున్నాం. అప్పటి నుంచి మహిళలపై అలాంటి వేధింపులకు పాల్పడే ఎవరినైనా కీచకుడిగానే పిలుచుకుంటాం. అలాంటి కీచకుడు కంటికి రెప్పలా కాపాడాల్సిన ఖాకీల రూపంలో కనిపించడం నాగరిక సమాజ ఆగ్రహానికి గురవుతోంది.
హైదరాబాద్ నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఈస్ట్ జోన్ సీఐగా పనిచేస్తూ మహిళా వేధింపులకు పాల్పడడంతో మూడు రోజుల క్రితం సస్పెండ్ అయ్యాడు. అయితే ఈ విషయమై అత్యంత గోప్యత పాటించడం గమనార్హం. పూర్తి వివరాలు తెలుసుకుంటే…అలాంటి కీచకుడిని ఊరికే వదిలి పెట్టొద్దని గట్టిగా డిమాండ్ చేస్తారు. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
బాధితురాలైన సదరు మహిళ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. ఆమె ఉద్యోగరీత్యా వరంగల్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం టెన్త్ క్లాస్ మార్కులిస్టులు పోవడంతో…ఫిర్యాదు చేసేందుకు మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పట్లో అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. బాధితురాలి సర్టిఫికెట్లను రికవరీ చేసి ఇచ్చాడు. ఇదే అలుసుగా, సాకుగా తీసుకున్న చంద్రకుమార్…అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడంతో పాటు మెసేజ్‌లో పెట్టేవాడు. ఇవన్నీ ఆమెకి దగ్గరయ్యేందుకు చంద్రకుమార్ పాల్పడిన ఛీప్ ట్రిక్స్.
ఐదేళ్ల క్రితం సచివాలయంలో ఆమెకు వ్యక్తిగతంగా ఓ పని పడింది. సదరు ఫైల్‌ను క్లియర్ చేయిస్తానంటూ బాధితురాలి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను యాచారం ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యాడు. సచివాలయం పనిని సాకుగా తీసుకుని తరచూ ఫోన్లు, మెసేజ్‌లో పెడుతూ వేధింపులకు పాల్పడేవాడు. తన కోరిక తీర్చితే వేధింపులు ఆపేస్తానని బెదిరింపులకు దిగాడు. అసలే పోలీస్ డిపార్ట్‌మెంట్. దీంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. దుష్టులకు దూరంగా ఉండడమే మంచిదని ఆమె భావించారు.
తనకు ఆమె దూరంగా ఉండడాన్ని చంద్రకుమార్ తట్టుకోలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రకుమార్ తన అధికార దర్పాన్ని ప్రదర్శించి లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. పిల్లల్ని కూడా హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. అంతేకాదు బాధితురాలి తండ్రికి కూడా ఫోసి తిట్టాడు. అతను ఎన్ని చేసినా ఆమె మాత్రం లొంగలేదు.
ఈ నేపథ్యంలో బాధితురాలు చంద్రకుమార్‌పై రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పిలిపిం చుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక మీదట బాధితురాలి ముఖం కూడా చూడనని, తన పని తాను చేసుకుంటానని, అలాగే ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. రాచకొండ పోలీస్ కార్యాలయం నుంచి బయటికి రాగానే యధా ప్రకారం వేధించడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు, మరింత బరితెగించాడు.
బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. చంద్రకుమార్ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో బాధితురాలు తీవ్రంగా కుంగిపోయారు. ఏదో ఒకటి తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తోపాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ విచారించి మూడు రోజుల క్రితం చంద్రకుమార్‌ను సస్పెండ్ చేశారు. ఆయనపై నిర్భయ కేసు నమోదు అయింది. కానీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా తనను లైంగిక వేధిస్తూ…ప్రస్తుతం ఎస్బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రకుమార్‌ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడంపై బాధితురాలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం పోలీసులు ఆ కీచకుడిని రక్షిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.