డ్రగ్స్ కేసు.. హీరోయిన్ కు నోటీసులు

కోలీవుడ్ లో 'డ్రగ్స్' ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు నోటీసులు జారీచేసింది ఎన్ఐఏ. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. Advertisement కొన్నాళ్లుగా తమిళనాడులో…

కోలీవుడ్ లో 'డ్రగ్స్' ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు నోటీసులు జారీచేసింది ఎన్ఐఏ. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.

కొన్నాళ్లుగా తమిళనాడులో మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల రవాణా సాగుతున్న విషయాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ పసిగట్టింది. మరీ ముఖ్యంగా కొంతమంది విదేశీయులతో కలిసి తమిళ ఈలం సభ్యులు మాదకద్రవ్యాల్ని, ఆయుధాల్ని తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీని ద్వారా వచ్చే డబ్బుతో భారత్, శ్రీలంకలో ఎల్టీటీఈ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయాలని చూస్తున్నట్టు కీలక సమాచారం అందుకుంది ఎన్ఐఏ.

దీంతో కొన్ని రోజులుగా విచారణ చేపట్టిన అధికారులు.. కీలక పురోగతి సాధించారు. ఈలం సభ్యులతో పాటు కొంతమంది విదేశీయుల్ని తిరుచ్చిలో నిర్బంధించారు. ఇలా అరెస్ట్ అయిన 13 మందిలో గుణ, పుష్పరాజ్, అజ్మిన్ లాంటి కీలక సభ్యులు కూడా ఉన్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదిలింగం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఎవరీ ఆదిలింగం.. ఆదిలింగంను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు అతడి నుంచి 300 కేజీల హెరాయిన్ (రూ.2100 కోట్లు), ఏకే-47తో పాటు,మరికొన్ని తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే వరలక్ష్మి శరత్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. గతంలో వరలక్ష్మికి పీఏగా పనిచేశాడు ఆదిలింగం. దీంతో ఆమెను కూడా విచారించాలని నిర్ణయించుకుంది ఏజెన్సీ. ఇందులో భాగంగానే ఆమెకు నోటీసులు జారీ చేసింది.

డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును ఆదిలింగం, కోలీవుడ్ లో పెట్టుబడులుగా పెడుతున్నాడని అనుమానిస్తున్నారు అధికారులు. వరలక్ష్మి ఇచ్చిన సమాచారం వాళ్లకు మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు. పైగా ఆదిలింగంను వరలక్ష్మి ఎందుకు పనిలోంచి తప్పించిందనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు.

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వరలక్ష్మి. తమిళ్ తో పాటు, పలు తెలుగు సినిమాలు చేసింది. క్రాక్, నాంది లాంటి సినిమాలు ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.