ఏకంగా రెండు స్థానాల్లో పోటీచేశారు. నిలబడిన రెండుచోట్ల ఓడిపోయారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. గన్నవరంలో ఉపఎన్నిక దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది. వల్లభనేని వంశీ రాజీనామాతో అక్కడ మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి ఈసారి పవన్ బరిలో నిలుస్తారా? తమ పార్టీ కౌంట్ ను ఒకటి నుంచి రెండుకు తీసుకెళ్తారా?
గత ఎన్నికల్లోనే గన్నవరం నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయింది జనసేన. నిజానికి జనసేన అక్కడ నేరుగా పోటీ చేయలేదు. కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా సీపీఐకి ఆ స్థానం ఇచ్చేసింది. అయితే వాస్తవం ఏంటంటే.. అక్కడ జనసేన తరఫున పవన్ కల్యాణ్ నిలిచినా కూడా గెలవలేరు. అందుకే తెలివిగా జనసేనాని తప్పించుకున్నారు. అలాంటి స్థానం నుంచి పవన్ పార్టీ మరోసారి బరిలో నిలుస్తుందని ఆశించలేం. కానీ జనసైనికుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.
గడిచిన ఐదునెలల్లో జనసేనకు భారీగా మద్దతుదారులు పెరిగారట. రాష్ట్రవ్యాప్తంగా జనసేన అనుకూలురు, సానుభూతిపరులు లక్షల సంఖ్యలో పెరిగారని జనసైనికులు ఊదరగొడుతున్నారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీల చేతకాని పాలన వల్లనే ప్రజలంతా పవన్ వైపు మొగ్గుచూపుతున్నారని, ఆధారాల్లేని సర్వేల్ని నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. నిజంగా పవన్ కు అంత నమ్మకం ఉంటే, ఈ సర్వేలు నిజమని భావిస్తే గన్నవరం నుంచి స్వయంగా పోటీకి దిగాలి.
పోయినసారి అతి స్వల్ప మెజారిటీతో గన్నవరం స్థానాన్ని వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా సూటిగా అంకెల్లో చెప్పాలంటే టీడీపీకి చెందిన వల్లభనేని వంశీకి లక్షా 3వేల 881 ఓట్లు వస్తే.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావ్ కు లక్షా 3వేల 43 ఓట్లు వచ్చాయి. అంటే… కేవలం 838 ఓట్ల తేడాతో అక్కడ వైసీపీ ఓడిపోయింది. సో.. ఈసారి ఉపఎన్నిక వస్తే అక్కడ వైసీపీ గెలుపు తథ్యం. సామాజిక వర్గం పరంగా చూసుకున్నప్పటికీ.. అధికార పక్షం ఎడ్వాంటేజీని లెక్కేసుకున్నప్పటికీ.. వైసీపీ గెలవడం గ్యారెంటీ.
ఇలాంటి సెగ్మెంట్ నుంచి పవన్ బరిలోకి దిగితే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది. కానీ జనసైనికుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఈసారి తమ నాయకుడే స్వయంగా గన్నవరం నుంచి బరిలోకి దిగుతారంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లో తెగ పోస్టులు పడుతున్నాయి. ఈ పొగడ్తలకు లొంగితే పవన్ మరోసారి బొక్కబోర్తా పడడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడే ఓ గమ్మత్తైన ట్విస్ట్ ఉంది. గత ఎన్నికల్లో తెరవెనక లోపాయికారీ ఒప్పందంతో టీడీపీ, జనసేన కలిసి పనిచేశాయి.
ఈసారి గన్నవరం ఉపఎన్నికలో తను పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్థికి పవన్ భేషరతుగా మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు చాలామంది. అలాచేయడం వల్ల టీడీపీ-జనసేన మరోసారి అధికారికంగా కలిసినట్టు అవుతుంది. అదే జరిగితే జనసేనకు ఇక పోటీచేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్వరూ ప్రశ్నించే అవకాశం కూడా లేదు. మొన్న కమ్యూనిస్టుల్ని అడ్డుపెట్టుకొని గన్నవరంలో తప్పించుకున్న జనసేనాని, ఈసారి ఇలా తప్పించుకుంటారేమో చూడాలి.