చ‌చ్చినా నేను ఆ పార్టీల్లో చేర‌ను

తెలంగాణ‌లోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌త విద్వేష ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డం, 40 రోజుల‌కు పైగా జైలు జీవితం గ‌డిపిన…

తెలంగాణ‌లోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌త విద్వేష ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డం, 40 రోజుల‌కు పైగా జైలు జీవితం గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. పార్టీకి న‌ష్టం వాటిల్లేలా వివాదాస్ప‌ద కామెంట్స్ చేసిన రాజాసింగ్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. 

త‌న‌కు టికెట్ వ‌స్తుందో, రాదో, మ‌ళ్లీ చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెడ్తానో, లేదో అని ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో రాజాసింగ్ భావోద్వేగంగా అన్నారు. తాజాగా మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీపై మ‌న‌సులో మాట చెప్పారు. 

రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే రాజ‌కీయాలు వ‌దిలేస్తాన‌ని రాజాసింగ్ అన్నారు. స్వ‌తంత్రంగా లేదా ఇత‌ర ప్రాంతాల నుంచి పోటీ చేయ‌న‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. గోషామ‌హ‌ల్ టికెట్ బీఆర్ఎస్ చేతిలో లేద‌న్నారు. అసదుద్దీన్ ఒవైసీ లేదా అక్బ‌రుద్దీన్ ఒవైసీ ఎవ‌రి పేరు పంపితే వారిని బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తుంద‌న్నారు.

తాను చ‌చ్చినా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ త‌దిత‌ర సెక్యుల‌ర్ పార్టీల‌లో చేరే ప్ర‌శ్నే లేద‌న్నారు. తెలంగాణ‌ను, దేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. బీజేపీలోనే వుంటాన‌న్నారు. లేదంటే కొంత కాలం రాజ‌కీయాలు విడిచిపెట్టి హిందూ దేశం కోసం ప‌ని చేసుకుంటాన‌న్నారు. త్వ‌ర‌లో త‌న‌పై స‌స్పెన్ష‌న్‌ను బీజేపీ ఎత్తివేస్తుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర పార్టీ త‌న‌కు అనుకూలంగా ఉంద‌న్నారు. మ‌రోసారి గోషామ‌హ‌ల్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని, త‌ప్ప‌క గెలుస్తామ‌న్నారు.