టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వేగంగా సాగుతోంది. లోకేశ్ నడకపై టీడీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి లాభం ఎంత అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. నిజానికి లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారనే వార్త బయటికి వచ్చినప్పుడు ప్రత్యర్థులు వెటకరించారు.
లోకేశ్ నడిచేంత సీన్ లేదని మెజార్టీ అభిప్రాయం వెలువడింది. సహజంగానే లోకేశ్‌పై పప్పు అనే అభిప్రాయం బలంగా వుండడంతో, యువ నాయకుడి నడక ముందుకు సాగడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. నడకను ముందుకు సాగించలేక అర్ధాంతరంగా ఆగిపోతే, టీడీపీకి భారీ నష్టమనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనపడింది. అయితే అలాంటి అనుమానాలను, ఆందోళనలను పటాపంచలు చేస్తూ లోకేశ్ అడుగులు ముందుకే పడ్డాయి.
ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రపై ఆయన తల్లి నారా భువనేశ్వరి తన అభిప్రాయాల్ని బయట పెట్టారు. కుప్పంలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ కుమారుడి పాదయాత్రపై స్పందించడం విశేషం. తన కుమారుడు పాదయాత్ర చేస్తానని చెప్పినప్పుడు మొదట ఆవేదన, ఆందోళనకు గురైనట్టు చెప్పారు.
లోకేశ్ పాదయాత్ర చేస్తున్న మొదటి రోజుల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తన మాతృ హృదయాన్ని ప్రదర్శించారు. లోకేశ్ తనకు ధైర్యం చెప్పారన్నారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా లోకేశ్ పాదయాత్రను పూర్తి చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని భువనేశ్వరి తేల్చి చెప్పారు.