దొంగే దొంగా దొంగా అన్న‌ట్టుగా…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకునేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దొంగ ఓట్ల…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకునేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దొంగ ఓట్ల ఎపిసోడ్ దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరింది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు స్వ‌యంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి దొంగ ఓట్ల‌పై ఫిర్యాదు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

దొంగ ఓట్ల‌ను ఏరిపారేసేంత వ‌ర‌కూ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి వీల్లేద‌ని ఆయ‌న అన్నారు. ఇదే సంద‌ర్భంగా అధికార ప‌క్షం వైసీపీ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో దొంగ ఓట్ల‌ను తొల‌గించాల‌ని ఫిర్యాదు చేయ‌డం విశేషం. 2014 నుంచి ఏపీలో న‌మోదైన దొంగ ఓట్ల‌ను నిగ్గు తేల్చాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోర‌డం గ‌మ‌నార్హం. ఇలా టీడీపీ, వైసీపీలు దొంగ ఓట్ల‌ను చేర్పించింది నువ్వంటే నువ్వ‌ని ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

గ‌తంలో కూడా ఎన్నిక‌ల సంద‌ర్భంలో టీడీపీ దొంగ ఓట్ల‌ను వైసీపీ వ్యూహాత్మ‌కంగా ప‌ట్టుకుంది. అప్ప‌ట్లో 30 ల‌క్ష‌ల దొంగ ఓట్ల‌ను గుర్తించి, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి, వాటి తొల‌గింపున‌కు తీవ్ర‌స్థాయిలో పోరాడాల్సి వ‌చ్చింది. వైసీపీ ప్ర‌భుత్వం దొంగ ఓట్ల‌ను చేర్చింద‌నే చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌ను మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ గ‌ట్టిగా తిప్పి కొట్టారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగా దొంగా అన్న‌ట్టుగా చంద్ర‌బాబు వైఖ‌రి వుంద‌ని త‌ప్పు ప‌ట్టారు.

దొంగ ఓట్లు న‌మోదు చేయించిందే టీడీపీ ప్ర‌భుత్వం అని ఆమె ఆరోపించారు. దొంగ ఓట్ల‌పై బాబు ఫిర్యాదు హాస్యాస్ప‌దమ‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే చంద్ర‌బాబు ఫిర్యాదు డ్రామాకు తెర‌లేపార‌ని ఆమె విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి వైసీపీనే విజ‌యం సాధిస్తుంద‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మ‌రోసారి సీఎం అవుతార‌ని మంత్రి జోస్యం చెప్పారు.