గ్రాస్ కలెక్షన్స్ తో హీరోల తొండాట?

“కోడి ముందా గుడ్డు ముందా” అనేది చెప్పడం ఎంత కష్టమో, హీరోలు అడుగుతుంటే నిర్మాతలు ఇస్తున్నారా లేక నిర్మాతలు ఇస్తుంటే హీరోలు పుచ్చుకుంటున్నారా అనేది కూడా అలాంటి శేష ప్రశ్నే.  Advertisement ఎందుకంటే డిమాండ్…

“కోడి ముందా గుడ్డు ముందా” అనేది చెప్పడం ఎంత కష్టమో, హీరోలు అడుగుతుంటే నిర్మాతలు ఇస్తున్నారా లేక నిర్మాతలు ఇస్తుంటే హీరోలు పుచ్చుకుంటున్నారా అనేది కూడా అలాంటి శేష ప్రశ్నే. 

ఎందుకంటే డిమాండ్ చేసినంత మాత్రాన ఇచ్చేయాలనీ లేదు, అనుకున్నదానికంటే ఎక్కువిస్తున్నప్పుడు పుచ్చుకోకూడదనీ కాదు. ఆ మాట కొస్తే మునుపటి సినిమాకి పుచ్చుకున్న దానికంటే ఎక్కువ పేమెంట్ ఏ నిర్మాతైనా హీరోకి ఇస్తే వద్దని ఎందుకంటాడు? చక్కగా పుచ్చుకుంటాడు. సినిమా బిజినెస్ నుంచి రికవర్ చేసుకోవాల్సిన తంటా ఇచ్చిన నిర్మాతదే తప్ప హీరోదెందుకవుతుంది? ఇదంతా ఒక ఆర్గ్యుమెంట్. 

అయితే అన్ని సార్లూ నిర్మాతలు అంతలా ఇచ్చేయడానికి వాళ్లేమీ అమాయకులు కాదని, ఒక్కోసారి హీరోల డిమాండ్లకు తలొగ్గి నడుచుకోవాల్సి ఉంటున్దని చెబుతున్న వాళ్లు కూడా ఉన్నారు. 

అప్పట్లో ఫలానా హీరో ముందుగా ఒక అమౌంట్ కి ఒప్పుకున్నాడు. నిర్మాత ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ లోపు ఆ హీరో సినిమా ఒకటి అనుకున్నదానికంటే బాగా ఆడేసింది. దాంతో ఈ హీరో తన మార్కెట్ రేంజ్ పెరిగిందని, అగ్రీమెంట్ ని మళ్లీ రాసుకుందామని చెప్పి ముందు అనుకున్న దానికంటే ఐదు కోట్లు రెమ్యునరేషన్ పెంచేసాడు. ఆ ఐదూ మరొక ఫైనన్షియర్ నుంచి ఎక్కువ వడ్డీకి తేవడం, అనుకున్న టైం కంటే సినిమా విడుదల జాప్యమవ్వడం, ఆ పైన సినిమా ఫ్లాపవ్వడం కారణంగా నిర్మాతకి, పంపిణీదారులకి చమురు వదిలింది. 

ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు. 

ఇక్కడ హీరోలు తమ మార్కెట్ ని కొలిచేది గ్రాస్ కలెక్షన్ తో. గ్రాస్ అంటే బాక్సాఫీసు వద్ద వసూలైన మొత్తం అన్నమాట. అందులోంచి థియేటర్ రెంట్లు, ప్రింట్ పబ్లిసిటీ ఖర్చులు, ట్యాక్సులు అన్నీ తీసేస్తే మిగిలిన దానిని ప్రొడ్యూసర్ షేర్ అంటారు. ఇందులో మళ్లీ అందరి రెమ్యూనరేషన్స్, వడ్డీలు వగైరాలుంటాయి. అవన్నీ తీసేయగా ఏదైనా మిగిలితే అది ప్రొడ్యూసర్ కి వ్యక్తిగతంగా మిగిలిన లాభం అన్నమాట. అదే ఆదాయం, దాని మీదే నిర్మాత తన వ్యక్తిగత ఆదాయపు పన్ను కట్టడం వంటివి ఉంటాయి. 

వినడానికి భయంకరంగా ఉన్నా నూటికి తొంభై మంది నిర్మాతలు అసలు లాభం చూడరు. ఒకవేళ చూసిన సినిమా ఆడకపోతే రాసుకున్న అగ్రీమెంట్స్ ని బట్టి కొంత డిస్ట్రిబ్యూటర్స్ కి చెల్లించాల్సి రావొచ్చు. దాంతో మైనస్సుల్లోకి పోవచ్చు. అలా నష్టపోతున్నా కూడా మళ్లీ మళ్లీ సినిమాలు తీయడమెందుకంటే పోయిన చోటే వెతుక్కోవాలనుకోవడం, ఒక్క సినిమా సరైన సక్సెస్ కొడితే తప్ప అప్పులన్నీ తీర్చగలిగే పరిస్థితి లేకపోవడం, మనీ రొటేషన్ జరుగుతూ కొన్ని అప్పులు తీరుతూ, తాము కూడా బతుకుతూ ఉండాలంటే ఎప్పటిక్పప్పుడు కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయడం..ఇలా తాము గీసుకున్న వలయంలో ఉండిపోతుంటారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే భారత ప్రభుత్వం ఏ వ్యాపారస్థుడికైనా గ్రాస్ కలెక్షన్ మీద జీఎస్టీ బాదుతున్నట్టు, హీరోలు తమ సినిమాల గ్రాస్ కలెక్షన్ చూపించి నిర్మాతల్ని పేమెంట్లు పెంచమంటున్నారు. 

ఒకవేళ మునుపటి సినిమా పోయి పెద్దగా కలెక్షన్ లేకపోతే ఆ తదుపరి సినిమాకి తగ్గిస్తాడా సదరు హీరో అంటే..తగ్గించడు. తన ఆఖరి హయ్యెష్ట్ గ్రాస్ కలెక్షన్ ఏదో దానికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్స్ అడుగుతున్నారట అధికశాతం మంది హీరోలు. ఇంతకంటే తొండాట మరొకటి ఉండదు కదా! 

నిర్మాత శ్రేయస్సుకోసం ఆలోచించే హీరోలు తగ్గిపోతున్నారు. అత్యాశ, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో అధికంగా సంపాదించేయాలి, ఫలానా హీరోకంటే పెద్ద ఇల్లు కట్టాలి, ఫలానా ఇన్వెష్ట్మెంట్ చేసేయాలి.. ఈ యావే తప్ప నిర్మాత నొప్పిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఈ నిర్మాతలు కూడా మునుపటిలా లేరు. అలవికాని బడ్జెట్లతో సినిమాలు తీస్తూ, జీవితాంతం వడ్డీలు కడుతూ, రొటేషన్ చక్రవర్తుల్లా బతికేస్తున్నారు. ఎందుకంటే అంత లోతు గోతిలోకి దిగాక టెన్షన్ పడి ఉపయోగం లేదు. అన్ని అప్పులూ ఒకేసారి తీరడం జరగదు. హీరోలతో మంచిగా ఉంటూ, వాళ్ల డేట్స్ కొనుక్కుంటూ, అధిక పేమెంట్లతో గిల్లినా అరవకుండా గిల్లించుకుంటూ.. బ్లాక్ బస్టర్ హిట్ కోసం చకోర పక్షుల్లా వేచి ఉండడం తప్ప మరొక మార్గం ఉండదు. 

హీరోల ఈగోలని పేంపర్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కేవలం పొగడ్తలతో పడరు వాళ్లు. ఖరీదైన గిఫ్టులివ్వాలి, చార్టర్ ఫ్లైట్స్ లో వాళ్ల వ్యక్తిగత ఫ్యామిలీ టూర్స్ ని స్పాన్సర్ చెయడం..ఇలా ఒకటి కాదు, నిర్మాతలు పోటీలు పడుతూ హీరోలని మచ్చిక చేసుకుంటుంటారు లైన్లో సినిమా ఉన్నా లేకపోయినా. ఇక్కడ స్టార్ హీరోలే మహారాజులు. అదంతే! 

చిత్రపరిశ్రమలో ఏ హీరో కూడా నష్టపోవడం లేదు. ఏ టెక్నీషియన్ కూడా సినిమా వల్ల లాభం పొందకుండా లేడు. కానీ తేలినా తేలకపోయినా మునిగేది మాత్రం నిర్మాతలు, పంపిణీదారులే. 

– శ్రీనివాసమూర్తి