‘ముని’వాక్యం: అమ్మను కాపాడుకోవడం ఎలా?

నాకు తెలియని నెంబరు నుంచి కాల్ వస్తుంది! తీయగానే, “I am Malini calling from so&so bank sir” అని చాలా తీయగానూ, మార్దవంగానూ, హొయలుగానూ ఒక కంఠం వినిపిస్తుంది. బ్యాంకు కాకపోతే…

నాకు తెలియని నెంబరు నుంచి కాల్ వస్తుంది! తీయగానే, “I am Malini calling from so&so bank sir” అని చాలా తీయగానూ, మార్దవంగానూ, హొయలుగానూ ఒక కంఠం వినిపిస్తుంది. బ్యాంకు కాకపోతే కార్లు అమ్మే కొనే దుకాణం తరఫునో, ఆస్పత్రుల పనుపునో.. సేవలు ఏవైనా కావొచ్చు. ఆ తరహా కాల్‌లో ఇంగ్లిషు పలకరింపు వస్తుంది. ‘‘నీకు తెలుగు వస్తుందా అమ్మా’’ అంటాన్నేను.

హైదరాబాదు నుంచే ఫోను చేసి మాట్లాడేవాళ్లయితే వెంటనే తెలుగులోకి మారుతారు. కానీ ఇలాంటి కాల్ చేసే సేవల కార్యాలయాలు ముంబాయి వంటి నగరాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనో కూడా ఉంటాయి. అలాంటి వారు ‘నీకు తెలుగు తెలుసా’ అని నేను అడగగానే, సంభాషణను పొడిగించే ప్రయత్నం చేస్తారు ఇలా.. “No Sir, Are you comfortable  with English or Hindi Sir” అంటుంది ఇంకా తియ్యగా. అందులో ఒక్క అక్షరం కూడా అర్థం కానట్టుగా ‘‘నీకు తెలుగు వస్తుందామ్మా’’ అంటూ అదే ప్రశ్నను పునఃసంధిస్తాను నేను! నాతో మాట కొనసాగించడానికి వేరే దారిలేక ఇంకేదేదో మాటలు చెబుతుంది. 

‘‘తెలుగు తప్ప ఇంకేం రాదమ్మా. తెలుగు తెలిసిన వాళ్లతో ఫోను చేయించవమ్మా’’ అంటాను నేను. “Ok, we will get back to you Sir” అంటూ ముగిస్తుంది. కాసేపటి తర్వాత గానీ, మరురోజు గానీ.. మళ్లీ కాల్ వస్తుంది. ఈసారి ఆ అమ్మాయి తెలుగులోనే మాట్లాడుతుంది. నిన్న మరొకరు పలకరించిన వైనం గుర్తుచేస్తుంది. ‘‘క్రెడిట్ కార్డు కావాలా’’ లేదా మీ కారు అమ్ముతారా? రియలెస్టేటు ప్లాట్లు కొంటారా? మీకు గుండెజబ్బు వస్తుందేమో- వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటారా? వంటి ప్రశ్నలు అడుగుతుంది. తొలిదశలో ఎన్ని కాల్స్ వచ్చినా.. ‘మీకు తెలుగొచ్చా’ అని ఒకే మాట జవాబిచ్చే నేను, తెలుగు అమ్మాయి ప్రశ్నించిన తర్వాత.. ‘‘అక్కర్లేదమ్మా’’ అని ముక్తాయిస్తాను.

మొదటి కాల్ లోనే “not interested” అంటే ఈ చెత్త కొనసాగింపు ఉండదు. కానీ..ఇలా అడగడంలో ఒక ఉపయోగం ఉంటుందని నా నమ్మకం. నాలాగా బోలెడు మంది, బోలెడు టెలికాలర్స్‌ను ‘తెలుగు వచ్చా’ అని పదేపదే అడుగుతూ, తెలుగు వచ్చిన వారికి తప్ప మరొకరికి జవాబివ్వకుండా ఉన్నట్లయితే.. భవిష్యత్తు తరాల్లో కూడా తెలుగు మాట్లాడడం తెలియడమే ఒక అర్హతగా కొన్ని ఉద్యోగాలు పుడుతుంటాయి. కనీసం అలాంటి కొలువుల కోసమైనా తెలుగును రేపటితరాల వారు కూడా నేర్చుకుంటూ ఉంటారు. తెలుగు బతుకుతుంది.. అనే నమ్మకం! ఇంకొక అలవాటు కూడా ఉంది నాకు. డబ్బు కోసం ఏటీఎం లోకి వెళ్లినప్పుడు భాషను ఎంచుకోమని ఆ మెషిన్ అడగ్గానే.. ‘తెలుగు’ను ఎంచుకుంటాను. తెలుగు మాత్రమే తెలిసినవాళ్లు కొందరున్నారని.. సదరు బ్యాంకు వారికి అనిపిస్తే గనుక.. ఆ భాషకు వారు ఇచ్చిన విలువ ఇంకొంత కాలం కొనసాగుతుందని ఒక ఆశ.

ఇలాంటి సొంత అనుభవాలను ఎందుకు నెమరు వేసుకోవలసి వస్తున్నదంటే.. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. అమ్మలాంటి తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం గురించి, ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి చాలా మంది  చాలా చెబుతూ ఉంటారు. కాపాడుకోవడం ఎలాగ? అనేది అంత విస్తృతంగా వినిపించదు. ఎందుకంటే.. ‘కాపాడుకోవడం అవసరం’ అని ఉపదేశం చేసినంత సులువు కాదు ‘కాపాడుకోవడం ఎలాగో’ సూచన చేయడం!

చదువులు ఇంగ్లిషు మీడియం అయిపోతున్నాయని, ఆ చదువుల పట్ల వెంపర్లాటను నిందిస్తుంటారు చాలా మంది. ప్రభుత్వం ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడాన్ని తూలనాడుతారు. నిజానికి అందులో చాలా రాజకీయ కోణాలే ఉంటాయి. దానికి తగ్గట్టుకు ప్రతిస్పందనలు కూడా రాజకీయంగానే ఉంటాయి. ‘మీ పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదువుకోవాలి.. పేదలు మాత్రం చదవకూడదా?’ అని! ఇలాంటి వ్యర్థ చర్చల వల్ల అసలు సమస్య పక్కదారి పట్టిపోతుంది.

సమస్య- తెలుగుభాషను కాపాడుకోవడం గురించి. ఇంగ్లిషు మీడియం చదువుల వలన తెలుగు భాష నాశనమైపోతుందని, పిల్లలకు తెలుగు తెలియకుండా పోతుందనే వాదనతో నేను పూర్తిగా ఏకీభవించలేను. ఇంగ్లిషు మీడియాన్ని సమర్థించే వారి రాజకీయ ప్రేరేపిత వాదనల ప్రకారం.. తెలుగు మీడియం ఉండాలని అనడానికి, నాక్కూడా అర్హత లేదు. ఎందుకంటే నా పిల్లలు తొలినుంచి ఇంగ్లిషు మీడియంలోనే చదువుకున్నారు. 

తెలుగు వారికి ఒక బోధనాంశం కూడా కాదు. పూర్తిగా ఇంగ్లిషు మీడియం.. భాష విషయానికి వస్తే హిందీ లేదా సంస్కృతంతో చదువులు సాగాయి. కానీ ఇద్దరూ తెలుగు చదువుతారు. రాయగలరు. సంభాషణలో ఓ మోస్తరు నుడికారాలతో కూడిన భాషను, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడగలరు. భవిష్యత్తరాల్లో తెలుగు భాషను కాపాడుకోవడానికి ఆ మాత్రం చాలుననుకుంటాను. అయితే వారికి ఒకటోతరగతి కంటె ముందునుంచి ఇంట్లో మేం నేర్పడం వల్లనే తెలుగు అలవాటైంది.

ఇంగ్లిషు మీడియంను పూర్తిగా వ్యతిరేకిస్తూ పిల్లలకు మంచి భవిష్యత్తును దూరం చేస్తున్నామనే అపకీర్తిని మూటగట్టుకోవడం బదులుగా.. ఉన్నతపాఠశాల విద్య పూర్తయ్యే వరకు తెలుగు భాష ఒక బోధనాంశంగా తప్పనిసరిగా ఉండాల్సిందే అని కోరడం మంచిది. అక్కడితో సరిపోదు, ఆ తెలుగు నేర్పే వారు చాలా శ్రద్ధగా నేర్పాలి కూడా. ఎలా నేర్చుకుంటున్నారో ఇళ్లలో తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలి. ‘భారం బడిదే’ అని వదిలేస్తే, భాషకు జరిగే ద్రోహం అచ్చంగా అదే అవుతుంది. కాలగమనంలో అనివార్యంగా వచ్చే మార్పులను ఆహ్వానిస్తూనే భాషను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. అది వ్యక్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ పూనిక వహించడం ద్వారా తప్ప సాధ్యం కాదు.

పిల్లలకు భాషను సక్రమంగా నేర్పితే చాలు. వారిని భాషా, సాహిత్యవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ఉపాధ్యాయులు అలాంటి విశిష్ట ప్రయత్నమూ చేస్తుంటారు. పిల్లలో కథలు, కవితలు రాయించి.. పుస్తకాలు వేసి, అక్కడితో తాము తెలుగుభాషకు కిరీటం పెట్టినట్టు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని తయారుచేయడం మంచిదే. వారిన అభినందించాల్సిందే. అది వారి వ్యక్తిగత కీర్తికిరీటంలో కలికితురాయి అవుతుంది. 

కానీ.. ఒక ఉపాధ్యాయుడు శ్రద్ధగా తన తరగతిలోని ఇద్దరిని కవులో రచయితలో చేయడం కంటె నూటికి నూరుశాతం మందిని అక్షరాలు చక్కగా చదవగలిగిన వారిగా తయారుచేస్తే.. తెలుగుభాషకు సేవచేయడంలో ధన్యుడైనట్లు! నేర్పడంలో ఉన్న సాధకబాధకాలను చర్చించడానికి నేను బోధనారంగంలో ఉన్నవాడిని కాదు. కానీ, నాలుగు, ఆరు తరగతులకు వచ్చిన అనేక మంది పిల్లలు కనీసం వారి పాఠ్యపుస్తకంలోని పదాలను చదవలేకపోతున్నారని, అక్షరాలను గుర్తించలేకపోతున్నారని సాధికారికంగా చెప్పగలను. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి మార్గాలేమైనా ఉన్నయేమో.. విద్యారంగ నిపుణులు సూచనలు చేయాలి.

తెలుగు భాషాపరిరక్షణకు నడుం బిగించిన ప్రత్యేక వ్యక్తులు, ఉద్యమశీలురు ఎంతో మంది మనచుట్టూ, నా ఎరికలోనూ ఉన్నారు. వ్యవహార భాషనే రాతలోకి తేవడానికి బీజం వేసిన గిడుగు రామ్మూర్తి జయంతి నాడు.. అలాంటి వారందరికీ మనసా ప్రణమిల్లాలి. వారు ప్రభుత్వాలకు సంస్థలకు అనేక సూచనలు చేస్తుంటారు. అవన్నీ కూడా అనుసరణీయాలే. ఆలోచించి, సమీక్షించి ఆచరణలో పెట్టదగినవే.

మనబోటి సామాన్యులకు సంబంధించినంత వరకు తెలుగును కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. తెలుగు భాషా ప్రవాహపు ఒరవడిలో పూర్తిగా కలిసిపోయిన, వాటి మూలాలను మనం మరిచేపోయిన పరభాషాపదాలు కూడా చాలా ఉన్నాయి. నిన్నటితరానికి, నేటి తరానికి ఈ పదాలు మారుతుంటాయి. పెరుగుతుంటాయి కూడా. ‘తెలుగు భాషలో ఒదిగిపోయిన వాటిని మనం అలాగే స్వీకరిస్తే తప్పు కాదు’ అని నాకు అనిపిస్తుంది. అచ్చతెలుగు మీది వ్యామోహంతో ప్రతి పరభాషా పదానికి ఒక తెలుగుపదాన్ని తయారుచేసి కృతకమైన ప్రయోగాలు చేయడం ఎందుకో నాకు మంచిదనిపించదు. 

ఈ వ్యాసం ప్రారంభించిన మొదటి వాక్యాన్నే తీసుకుందాం.. ‘నాకు తెలియని సంఖ్య నుంచి  పిలుపు వచ్చింది’ అనికూడా అనొచ్చు. కానీ అవతలి వారికి అర్థం కావడానికి కాసేపు పడుతుంది. అలాగని ‘unknown number నుంచి call వచ్చింది’ అనకుండా ఉంటే చాలు. అంటే భాషలో కలిసిపోయినవి తప్ప.. సులభంగా వాడదగిన తెలుగుపదాలకు కూడా ఇంగ్లిషు వాడకంలోకి దిగకుండా ఉంటే చాలు. తెలుగు భాష ఎక్కడకూ పోదు. కాపాడుకోగలం. అది పదిలంగానే ఉంటుంది. 

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]