దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కోపంతో ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై, ప్రధానంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై చిందులు తొక్కుతున్నారు. ఇందుకు కారణం…కేంద్రం రూపొందించిన వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు.
ఆల్రెడీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ ఆమెను ఎన్టీఆర్ భార్యగా గుర్తించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. ఇలా చేయడానికి నందమూరి కుటుంబమే కారణమనే అనుమానం ఉంది. బహుశా ఆమె వైసీపీ నేత కావడం మరో కారణం కావొచ్చు. ఏది ఏమైనా లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం వెనక చంద్రబాబు లాబీయింగ్ బలంగా పనిచేసి ఉండొచ్చు. కారణాలు ఏమైనా లక్ష్మీపార్వతి ఆగ్రహం తీవ్రస్థాయిలో ఉంది.
ఆమె ప్రధానంగా పురందేశ్వరి మీద మండిపడుతున్నారు. ‘నేను ఎన్టీఆర్‌కు అధికారికంగా భార్యను అవునా? కాదా? చెప్పాలి' అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం నుంచి పురందేశ్వరిని తరమికొట్టే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తానన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ తనను అధికారికంగా వివాహం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇల్లీగల్‌గా పెట్టుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు.
దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సొంత కార్యక్రమం అయితే తనను ఆహ్వానించకపోయినా పట్టించుకునేదాన్ని కాదన్నారు లక్ష్మీపార్వతి. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని అన్నారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వాని అందాల్సిందన్నారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. దీనిపై ఆమె అభ్యతరం వ్యక్తం చేశారు.
తనను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారా లేదా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెప్పాలన్నారు. తమ వివాహంపై అన్ని పత్రికలు రాశాయని గుర్తు చేశారు. ఎన్ని సార్లు తనను అవమానిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భార్యను అని బోర్డు కట్టుకుని తిరగాలా అని నిలదీశారు. ఢిల్లీ వెళ్లి పురందేశ్వరి, చంద్రబాబు కుట్రలను బీజేపీకి చెబుతానన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీలో ఉంటూ చంద్రబాబు స్క్రిప్టును పురందేశ్వరి చదువుతున్నారని ఆరోపించారు.
అందులో భాగంగానే ఎన్టీఆర్ భార్యగా తనను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై గౌరవంతో ఇన్ని రోజులు ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడలేదని ఇకపై మాట్లాడతానని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. పురందేశ్వరి, బాలకృష్ణ బాగోతాన్ని బయటపెడతానన్నారు. వాళ్లు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో ఎక్కడెక్కడ తిరుగుతారో వెళ్లి వాళ్ల నిజస్వరూపం ప్రజలకు తెలియజేస్తానన్నారు. అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా అని ప్రశ్నించారు.
ఆయనతో వివాహమైనట్లు ఫోటోలు, వార్తా కథనాలు ఉన్నాయన్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌గా ఉన్నానని.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు. ఎన్నాళ్లని వీళ్ల నుంచి అవమానాలు పడుతూ ఉండాలన్నారు.
ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చారా అని ప్రశ్నించారు. తనను ఎందుకు చులకన చేస్తున్నారని, తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చేసినట్టే అన్నారు. భువనేశ్వరి, పురందేశ్వరిలు తండ్రికి ద్రోహం చేశారని అన్నారు. కేంద్రం భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంతటి భీకర ప్రతిజ్ఞ చేసిన లక్ష్మీపార్వతి ముందు ముందు ఏం చేస్తారో చూడాలి.