సీఎం జగన్ కు చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన కేసుల విచారణకు ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిన అవసరాన్ని మినహాయించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన కేసుల విచారణకు ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిన అవసరాన్ని మినహాయించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన ఆ మినహాయింపును పొందుతూ ఉన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు. అది కూడా పక్క రాష్ట్రంలో కేసుల విచారణ సాగుతూఉంది. ఈ నేపథ్యంలో ప్రతివారం హాజరు కావడం ఇబ్బందికరం, విధులకు ఆటంకం నేపథ్యంలో.. మినహాయింపును పొడిగించాలని జగన్ కోరారు.

అయితే శుక్రవారం హాజరీ నుంచి మినహాయింపును ఇవ్వడం వల్ల జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ తన పాత వాదననే వినిపించింది. మరి ఒక్క శుక్రవారం మాత్రమే  జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతోంది కాబోలు. బహుశా ఏ కేసు విచారణలో కూడా ఇలా నిందితులు వారం వారం హాజరయ్యే పని ఉండాలని సీబీఐ కోరినట్టుగా లేదు. కేవలం జగన్ ను మాత్రమే ఈ రకంగా లక్ష్యంగా చేసుకున్న వైనం స్పష్టం అవుతూనే ఉంది.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారణ మొదలై ఏడేళ్లు గడిచిపోయినట్టుగా ఉన్నాయి. పదహారు నెలల పాటు జైల్లో కూడా  పెట్టుకున్నారు. ఇప్పటి  వరకూ తేల్చింది ఏమీ లేదు. అయినా ప్రతివారం కోర్టు లో జగన్ అటెండెన్స్ వేయిస్తోంది సీబీఐ. కోర్టు కూడా సీబీఐ వాదనతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం  ఇచ్చిన తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది.