హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ రాజీనామానే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు దారి తీసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ గట్టిగా తలపడ్డాయి. గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికార దుర్వినియోగంతో ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉన్నారన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దని బొంద పెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని తీవ్ర విమర్శలు చేశారు.
భావోద్వేగంతో ప్రజలకు ఓ అప్పీల్ చేశానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నట్టు ఈటల తెలిపారు. వందల కోట్లు డబ్బులు పంచినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. చరిత్రలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడు చూడలేదన్నారు.
ఐదు నెలలుగా జనంలో ఉన్నానని, కానీ ప్రలోబాలతో మూడు రోజుల్లోనే మార్చేశారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత నీచంగా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసిన పరిస్థితి చూడలేదని ఈటల తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. మూడు రోజుల్లోనే ప్రలోభాలతో మార్చేశారని ఈటల ఆవేదనతో… గెలుపుపై ఆశలు సన్నగిల్లాయా? అనే చర్చ జరుగుతోంది.