అబ్బాయి రొమాంటిక్. మంచి వయసులో ఉన్నాడు, హీరో అంటే అచ్చం అలాగే ఉన్నాడు. పైగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొడుకు. అందుకే ఆకాష్ పూరీకి ఆ హైప్ అలా వచ్చేసింది. ఇక పూరీ జగన్ ది విశాఖ జిల్లా నర్శీపట్నం సొంత ప్రాంతం.
ఆయన ఇద్దరు సోదరులూ కూడా జనాలకు పరిచయం ఉన్నావారే. పెద్ద తమ్ముడు పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్శీపట్నం ఎమ్మెల్యే, చిన్న తమ్ముడు సినీ హీరో సాయి రాం శంకర్. ఆకాష్ పూరీ రొమాంటిక్ మూవీ గ్రాండియర్ గా నిన్న రిలీజ్ అయింది.
దాంతో ఈ మూవీని తన సొంత ఊరు నర్శీపట్నంలో చూసేందుకు హీరో సాయి రాం శంకర్ వచ్చాడు. అన్నయ్య ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తో కలసి అక్కడి ధియేటర్లో సినిమా చూసి తెగ హుషార్ చేశారు. అబ్బాయ్ అదరహో అంటూ ఆడియన్స్ వద్ద బాబాయిలు తమ సంతోషం వ్యక్తం చేశారు.
ఆకాష్ పూరి సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని సినీ హీరో సాయిరాం శంకర్ పేర్కొన్నారు. రొమాంటిక్ సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందన్నారు. క్లైమాక్స్ లో ఆకాశ్ పూరి నటన అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేస్తుందన్నారు.
హీరో బాగా నటించాడని కొనియాడారు. మొత్తానికి ఆకాష్ పూరీ నటనను ఆకాశానికి ఎత్తేశారు ఇద్దరు బాబాయిలు. మరి అబ్బాయికి ఏం కావాలి. ఈ సినిమాలో ఆకాష్ నిజంగా బాగా చేశాడు అని నర్శీపట్నం వాసులు కొనియాడుతున్నారు. మొత్తానికి మా ఊరి కుర్రోడు శభాష్ అంటున్నారు.