ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే.. ఆ ప్రభావం కచ్చితంగా ఓటింగ్ శాతం మీద పడాలి. తెలుగుదేశం పార్టీ ఏపీలో గత కొన్నాళ్లు ఎన్నికల బహిష్కరణలు, నామినేషన్ల తర్వాత తప్పుకోవడాలు వంటివి చేస్తూ ఉంది. అయితే ఈ ప్రభావం పోలింగ్ శాతం మీద మాత్రం పెద్దగా కనపడకపోవడం గమనార్హం!
తెలుగుదేశం పార్టీ ఆ మధ్య ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ నామినేషన్ల దాఖలు అనంతరం ఆ పార్టీ అధినేత పోలింగ్ కు ముందు బహిష్కరణకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోరాటం అలా ముగిసింది. అయితే.. ఆ ప్రభావం పోలింగ్ మీద మాత్రం పెద్దగా పడలేదు.
మామూలుగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్దగా పోలింగ్ నమోదు కాదు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటేసే ఎన్నికలు కావవి. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆ ఎన్నికలను మరీ అంత తప్పనిసరిగా ఓటేయాలనేంత సీరియస్ గా తీసుకోరు.
కాబట్టి సహజంగానే పోలింగ్ శాతం తగ్గుతుంది. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బహిష్కరణ పిలుపు నేపథ్యంలో ఆ పార్టీ ఓటు బ్యాంకు అంతా పోలింగ్ కు దూరంగా ఉండాల్సింది. అయితే ఆ ప్రభావం ఆ స్థానిక ఎన్నికలపై పెద్దగా పడలేదు. పోలింగ్ శాతం చెప్పుకోదగిన స్థాయిలో, దాదాపు రొటీన్ రేంజ్ లో నమోదైంది.
ఇక బద్వేల్ పోటీ నుంచి కూడా టీడీపీ తప్పుకుంది. ముందుగా అభ్యర్థిని ప్రకటించి, ఆ తర్వాత మానవీయకోణం అంటూ తప్పుకుంది. మరి ఇప్పుడు కూడా లెక్క ప్రకారం చూస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుకుంది కాబట్టి.. పోలింగ్ శాతం 50లోపుకు పడిపోవాలి!
అందులోనూ టీడీపీ గతంలో బద్వేల్ లో చెప్పుకోదగిన పోటీనే ఇచ్చింది. ఆ పార్టీకి 30 శాతం స్థాయిలో ఓట్లు పడ్డాయి. మరి ఆ మేరకు ఇప్పుడు పోలింగ్ శాతం తగ్గాలి. అయితే.. అంత సీనేమీ కనిపించేలా లేదు. ఉదయం పదికే బద్వేల్ లో కూడా 10 శాతం మించి పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రానికి కనీసం అరవై శాతం పోలింగ్ దాటినా.. ఇక్కడ టీడీపీ పోటీలో లేని ప్రభావం పోలింగ్ మీద ఏ మాత్రం పడనట్టే!