తెలంగాణలో ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారి చాలా కాలం అవుతోంది. హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ల తర్వాత.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది రాజకీయ పార్టీలకు. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్నాయి. వీటికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఉనికిని కాపాడుకోవాల్సి ఉంది.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్-బీజేపీలు చేతులు కలిపాయని, టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు పలుకుతోందనే వాదనా ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి ఈ వాదన వినిపిస్తూ ఉంది. ఎలాగైతేనేం..పోటీ అయితే తీవ్ర స్థాయిలో ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ సాగుతున్న ఈ నియోజకవర్గం పరిధిలో రికార్డు స్థాయి పోలింగ్ ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఉదయం పది గంటలకే పది శాతం స్థాయిలో పోలింగ్ రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో సాయంత్రానికి 90 శాతం ఓట్లు పోల్ కావొచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇటీవలి కాలంలో తెలంగాణలో బై పోల్ ఏదైనా రికార్డు స్థాయి పోలింగ్ ఖాయంగా కనిపిస్తోంది. హుజూర్ నగర్ లో 84 శాతం, దుబ్బాకలో 83 శాతం, నాగార్జున సాగర్ లో 86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఆ నియోజకవర్గాలతో పోల్చినా.. హుజూరాబాద్ లో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అప్పట్లోనే 83 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. పార్టీలు ప్రతి ఓటర్ నూ కదిలించిన నేపథ్యంలో.. పోటాపోటీ స్థితిలో పోలింగ్ శాతం 90కు రీచ్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. మిగిలిన పది శాతం ఓట్లు కూడా డబ్లింగ్ లు, ఓటర్ల జాబితా నుంచి చేపట్టాల్సిన తొలగింపులు వంటి ఉంటాయంతే!