ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మంత్రివర్గ విస్తరణ. చాలామంది పదవులు ఊడిపోతాయనే ప్రచారం ఓవైపు, ఎన్నికల టీమ్ తో జగన్ ముందుకెళ్తారని మరోవైపు, మార్పుచేర్పులు పెద్దగా ఉండవని ఇంకోవైపు.. ఇలా రకరకాలుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు అసలు సమస్య ఇది కాదు.
మినిస్టర్ పోస్ట్ వస్తుందా రాదా అనే ఆలోచనను మించి ఎమ్మెల్యేల్ని ఇప్పుడు మరో ప్రచారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్. అవును.. వచ్చే ఎన్నికల్లో అసలు తమకు టిక్కెట్ దక్కుతుందా లేదా అనే టెన్షన్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఎక్కువైంది.
అసలు రీజన్ ఇది..
ఎవరు ఔనన్నా కాదన్నా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. గెలిచిన తర్వాత ప్రజాసమస్యల కంటే, సొంత వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టుకున్నారనే అపవాదు ఉంది. ఆమధ్య జాతీయ స్థాయిలో జరిగిన సర్వేల్లో కూడా ఇదే విషయం బయటపడింది. దీంతో ఈసారి చాలామంది సిట్టింగులకు ఎమ్మెల్యే టిక్కెట్లు దొరకడం కష్టమే అనే ఊహాగానం వినిపిస్తోంది.
మొహమాటానికి పోయి సిట్టింగ్ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే, పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కు సంకేతాలు అందుతున్నాయి. దీంతో కొన్ని నియోజకర్గాల్లో ప్రత్యామ్నాయాల వైపు జగన్ చూస్తున్నారనే కథనాలు.. ఎమ్మెల్యేల్ని టెన్షన్ పెడుతున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్ పోస్ట్ రాకపోయినా పర్వాలేదు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కితే అదే పదివేలు అంటూ ఎమ్మెల్యేలంతా గుసగుసలాడుకుంటున్నారు.
జగనే కారణమా..!
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక రకంగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కనీసం రికమండేషన్ చేయించుకుని కొత్తగా ఒక పింఛన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి. అన్నీ ఆన్ లైన్, అంతా పారదర్శకత. ఎమ్మెల్యేల మాటలు, హామీలకు పెద్దగా ప్రయోజనం లేదు అనేది వాస్తవం. మరోవైపు సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని మీట నొక్కడం, ఇక్కడ జనాల ఖాతాల్లో సొమ్ము జమకావడం. మధ్యలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా పెద్దగా పనిలేకుండా పోయింది.
నేరుగా సీఎం అన్నీ చేసేసుకుంటుంటే ఇక్కడ తామెందుకని మధనపడుతోంది మరో వర్గం. కళ్లముందు పనులున్నా.. నిధుల లేమి కొన్నిచోట్ల సమస్యగా మారింది. చాలామంది ఎమ్మెల్యేలు.. నిధుల్లేవు, మేమీ పనులు చేయలేమని ముందుగానే చెబుతున్నారు.
అయితే ఇంకొందరు మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం అటుంచి, కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తున్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తూ, నియోజకవర్గాల స్థాయిలో తాము తప్ప జగన్ కు మరో ప్రత్యామ్నాయం లేకుండా చూసుకుంటున్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం నిజాయితీగా సచివాలయాల సందర్శన పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ప్రజలకు పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటూ నిత్యం జనాల్లో ఉంటున్నారు. ఇలాంటి వారు మాత్రమే సిట్టింగ్ ల హోదాలో రెండోసారి టికెట్లు దక్కించుకునే అవకాశముంది.