మూవీ రివ్యూ: రొమాంటిక్

టైటిల్: రొమాంటిక్ రేటింగ్: 2/5 తారాగణం: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, రమాప్రభ తదితరులు కెమెరా: నరేష్ కంచెరాణా ఎడిటింగ్: జునైద్ సిద్దిక్ సంగీతం: సునీల్ కాశ్యప్ కథ: పూరి…

టైటిల్: రొమాంటిక్
రేటింగ్: 2/5
తారాగణం: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, రమాప్రభ తదితరులు
కెమెరా: నరేష్ కంచెరాణా
ఎడిటింగ్: జునైద్ సిద్దిక్
సంగీతం: సునీల్ కాశ్యప్
కథ: పూరి జగన్నాథ్
డయలాగ్స్: పూరి జగన్నాథ్
స్క్రీన్ ప్లే: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్
దర్శకత్వం: అనీల్ పాడూరి
విడుదల తేదీ: 27 అక్టోబర్ 2021

2018 లో కొడుకుని కమెర్షియల్ హీరోగా ప్రవేశపెడుతూ “మెహబూబా” తీసి భంగపడ్డ పూరి జగన్నాథ్ వెనువెంటనే “రొమాంటిక్” కూడా తీసారు. అయితే కరోనా కారణాల వల్ల కొంత, ఇతర సినిమాలు పట్టాలెక్కడం వల్ల కొంత ఆలశ్యమై మొత్తానికి ఆ చిత్రం నేడు విడుదలయ్యింది.

పూరీ మార్కు పాటలతో పాటు ట్రైలరు కూడా కమెర్షియల్ ఎలిమెంట్స్ తో కనిపించడం, ఏకంగా ప్రభాస్ సీన్లోకి దిగిపోయి సినిమా ప్రచారం చేయడం కారణంగా దీనిపై పూరి అభిమానుల్లోనూ, ఈ తరహా సినిమాలు ఇష్టపడే యువ ప్రేక్షకుల్లోనూ అంచనాలు రేకెత్తాయి.

హీరోయిన్ కేతిక శర్మ కూడా టార్గెట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవడంతో సినిమాపై ఆసక్తి ఇంకాస్త పెరిగింది.

పూరి సినిమా అంటే కేవలం యాక్షన్ కాదు.. శ్రద్ధగా చెక్కితే ఇంటిలిజెన్స్, లాజిక్, తూకం మిస్ కావనేది చాలామంది అభిప్రాయం. కానీ ఆ శ్రద్ధ ఇక్కడ కనిపించలేదు. వేరే హీరోల విషయంలో వహిస్తున్న శ్రద్ధ తనయుడి సినిమాలపై ఎందుకు పెట్టట్లేదో అర్థం కాదు.

ఎంత గొప్ప సర్జన్ అయినా సొంత వాళ్ల మీద సర్జరీ చేయాల్సొచ్చినప్పుడు చేతులు వణుకుతాయంటారు. అలా కొడుకు సినిమా అనగానే పూరి జగన్నాథ్ ఓవర్ కాన్షియస్ అవుతున్నారేమో అనిపిస్తోంది.

ఈ సినిమా విషయంలో డైరక్టరుగా తాను పక్కకి తప్పుకున్నానని చెప్పినా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు కూడా సమకూర్చాక దాదాపు అన్నీ ఆయనే చేసినట్టయింది.  డైరెక్షన్ కూడా పూరీ ఫక్కీలోనే ఉంది తప్ప మరొక దర్శకుడు తీసినట్టే లేదు. కనుక దర్శకత్వపర్యవేక్షణ కూడా ఆయనే చేసేరేమోనన్న అనుమానం రావడం సహజం.

ఇందులో “పోకిరి” స్టైల్లో రెండు మూడు ఆసక్తికరమైన ట్రాకులు లేవు. అంతా సింగిల్ ట్రాకులో మీటర్ గేజ్ బండిలా నడుస్తుంది. ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే కూడా లేదు. ఊహాతీతంగా తెర మీద ఏదీ జరగదు.

“బిజినెస్ మ్యాన్” లో లాగ పవర్ఫుల్ డయాలాగ్స్ లేవు. గత కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ పోడ్ క్యాస్టుల్లో వినిపించిన లైన్లే ఇక్కడ ఆకాష్ నోటివెంట డైలాగ్స్ గా కొన్ని వినపడ్డాయి.

“ఇస్మార్ట్ శంకర్” లో ఉన్నట్టుగా మాస్ కి ఊపునిచ్చే తీన్ మార్ పాటలు లేవు.

“బద్రి”లో ఉన్నట్టుగా మనసుకి హత్తుకునే ప్రేమకథ లేదు…హీరో హీరోయిన్ల మధ్య కామోద్రేకం తప్ప.

ఇలా పూరీ గత హిట్ చిత్రాలకి దోహదపడిన కీలకమైన అంశాలేవీ ఇందులో లేవు. ఆడియన్స్ ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుని తీసేసిన సినిమాలా అనిపిస్తుందిది.

తనపై రౌడీషీట్ ఓపెన్ అయితే నేరసామ్రాజ్యంలో తన రేంజ్ పెరుగుతుందని, కనుక తనని రౌడీషీటర్ గా గుర్తించమని హీరో ఇన్స్పెక్టర్ ని వేడుకోవడంలో టిపికల్ పూరీ మర్కు హీరో కనిపించాడు. కానీ మొదటి పనిగా ఒక విలన్ తన మనిషిని విడిపించమని హీరోని అడిగినప్పుడు తెలివిగా ఏదో చేస్తున్నాడనుకునే లోపు రొటీన్ హీరోలాగ ఫైటింగులు చేసి అతనిని విడిపించడంలో పూరీ తెలివి కనపడలేదు.

ప్రతీ సీన్ కన్వీనియన్స్ కి తగ్గట్టుగా రాసుకున్నట్టుంది తప్ప, ఎక్కడా ఒక బలమైన చాలెంజ్ కానీ, ఆర్గానిక్ ఎమోషన్ కానీ లేదు ఈ చిత్రంలో.

ప్రథమార్థమంతా వాస్కో, రోడ్రిగెజ్ అంటూ సగటు గోవా మనుషుల పేర్లతో తెలుగు సినిమా చూస్తున్న వాళ్లకి నాన్ సింక్ కొడుతూ నడిచింది. ద్వితీయార్థంలో కూడా కథ అక్కడక్కడే తిరిగి క్లైమాక్స్ లో మాత్రం ఎమోషన్ పండించింది…అది కూడా లాజిక్ ని పక్కన పెట్టి చూస్తేనే.

ఈ సినిమాలో హీరోయిన్ ని చూస్తే చాలు హీరోలో కామం బుసలు కొడుతుంది. కనికరం లేకుండా మీద పడి మాలెస్టేషన్ చేస్తుంటాడు. అలా చేయగా చేయగా ఆమె అతనికి లొంగినట్టుగా చూపించారు. దీనిని హీరోయిజం అనుకోమని ఈ సినిమా ద్వారా యువ ప్రేక్షకులకి చెప్పడమంటే అంతకన్నా ఘోరం మరొకటుండదు. ఇలాంటి సినిమాలు ఒకవేళ కమెర్షియల్ గా పాస్ అయినా ఈ సమస్యని మాత్రం ఎత్తి చూపాల్సిందే.

టెక్నికల్ గా తీసుకుంటే సంగీతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మాటలకే మ్యూజిక్ పెట్టి డీజే మిక్స్ ఒకటి, మ్యూజికల్ పొయట్రీ ఒకటి ప్రయోగాలు చేసారు. “పీనే కె బాద్” లో రాం, పూరి జగన్నాథ్ ఇద్దరూ కనిపించడంతో విజిల్స్ వినిపించాయి. మరొక పాటలో “ఇఫ్ యు ఆర్ మ్యాడ్- అయాం యువర్ డాడ్” అంటే ఏవిటో రాసిన కవిగారు వివరిస్తే తప్ప భావం బోధపడేలా లేదు.

ఆకాష్ నటనలో పరిణతి చెందాడు. కానీ ఇలాంటి హైడోస్ మాస్ హీరో పాత్రకి సూటవ్వాలంటే ఇంకొన్నేళ్ల టైం పట్టేలా ఉంది. హీరోయిన్ కేతిక శర్మ మాత్రం తన రూపంతో అకట్టుకుంది. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు.

పోలీసాఫీసర్ గా రమ్యకృష్ణ అవసరానికి మించి కష్టపడ్డారు. ఆకాష్ కి పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ పెట్టే సీన్లో “రక్తచరిత్ర”లో బుక్కారెడ్డికి పోలీసాఫీసర్ గా అశ్విని కల్శేకర్ గన్ పెట్టిన సీన్ గుర్తొస్తుంది. కానీ అక్కడ పండిన సన్నివేశం ఇక్కడ పండలేదు.

యూట్యూబులో “ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ ఆన్ న్యాగింగ్ హజ్బెండ్” లైన్లో సునయన, ఆమె భర్తగా చేసిన ఉత్తేజ్ మధ్య కామెడీ ట్రాక్ ఏదైనా నడిపినా కాస్త రిలీఫ్ ఉండేదేమో అనిపిస్తుంది.

పూరీ అభిమానులు, ఆయన ఏం తీసినా అద్భుతమే అనుకునే వీరాభిమానులు, హీరోయిన్ అందం మీద మనసు పారేసుకున్నవాళ్లు ఈ సినిమాని కాపాడాలి.

“ఏదైనా వంక పెట్టాలనుకున్నా ముసలాడివైపోయావు నీకేం తెలుసు అని యూత్ అంతా గొడవ పడతారేమోనని అనుమానంగా ఉంది. దర్శకుడు ఏ సీన్ ఎలా తీస్తే ఏంటి అని లెక్కలేసుకోకుండా మనసుకి నచ్చినట్టు తీసేసాడు…” అని ఈ సినిమా చూసిన రాజమౌళి అన్న మాటలు ఇక్కడ గుర్తుచేసుకోవాలి.

“ఏ సీన్ ఎలా తీస్తే ఏంటి అని లెక్కలేసుకోకుండా” అనే లైన్ లో ప్రశంసలాగ వినిపించే విమర్శ ఉందని అండర్లైన్ చేసుకోవాలి.

సినిమా అంతా అయ్యాక రోలింగ్ టైటిల్స్ లో సింబాలిక్ గా “నావల్ల కాదే…” అనే పాటొస్తుంది. ఇది ఈ సినిమాకి పనిచేసిన ఎడిటర్ ఫీలింగ్ అయ్యుండొచ్చు.

బాటంలైన్: వల్ల కాదే…