Advertisement

Advertisement


Home > Movies - Movie News

బెయిల్ దొరికినా తప్పని జైలు జీవితం

బెయిల్ దొరికినా తప్పని జైలు జీవితం

బెయిల్ దొరికిందన్న ఆనందం పూర్తిగా ఆవిరైంది. ఆర్యన్ ఖాన్ ఇంకా జైలులోనే ఊచలు లెక్కిస్తున్నాడు. నిన్న సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పు వచ్చింది. షరతులతో కూడిన దాని పూర్తి కాపీ ఈరోజు రిలీజ్ అయింది. ఆర్డర్ కాపీ ప్రకారం అన్ని పనులు చేసినప్పటికీ ఆర్యన్ ఈరోజు విడుదల కాలేదు.

ఎందుకంటే నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తర్వాత బెయిల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వరు. మళ్లీ మరుసటి రోజు ఉదయం ప్రాసెస్ చేయాల్సిందే. అలా ఈరాత్రి కూడా ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఉండబోతున్నాడు. రేపు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి బయటకు రాబోతున్నాడు షారూక్ కొడుకు ఆర్యన్.

14 షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది బాంబే హైకోర్టు. అందలో లక్ష రూపాయల పూచీకత్తుపై ఓ ష్యూరిటీ సంతకం అనే నిబంధన కూడా ఉంది. దాని కోసం స్వయంగా షారూక్ స్నేహితురాలు జూహీ చావ్లా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. స్వయంగా తను సంతకం పెట్టి షారూక్ కొడుకు కోసం షూరిటీ ఇచ్చింది. అక్కడితో జూహీ పని అయిపోయింది.

అయితే కోర్టు ఆర్డర్ కాపీ ప్రకారం, జైలుకు డాక్యుమెంట్లు సమర్పించడానికి షారూక్ తరఫు లాయర్లకు సమయం సరిపోలేదు. దీంతో జైలు గేట్లు మూసేశారు అధికారులు. షారూక్ కొడుకు కోసం నిబంధనలు సడలించలేమని విస్పష్టంగా ప్రకటించారు. అలా బెయిల్ తీర్పు వచ్చినప్పటికీ ఆర్యన్ 24 గంటలకు పైగా జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇక ఆర్యన్ ఖాన్ కు విధించిన షరతుల విషయానికొస్తే.. లక్ష రూపాయల బాండ్ తో పాటు, పాస్ పోర్ట్ ను కూడా సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి బయటకు వెళ్లకూడదని, ఇక ముంబయి దాటి బయటకు వెళ్లాలన్నా కూడా అధికారుల అనుమతి తీసుకోవాలని కోర్టు ఆర్యన్ ను ఆదేశించింది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఇతర వ్యక్తులతో ఆర్యన్ మాట్లాడకూడదని, మీడియా ముందు కూడా ఈ కేసుకు సంబంధించి స్పందించకూడదని కండిషన్ పెట్టింది బాంబే హైకోర్టు. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్ కు వచ్చి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు సంతకం పెట్టి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా బెయిల్ రద్దు చేయమని ఎన్సీబీ కోర్టును కోరవచ్చని సూచించింది హైకోర్టు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?