ఎవరు మాట్లాడితే ఉద్యమానికి సరికొత్త ఊపిరి వస్తుందో ఆమె తానుగా కదలి వస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని మొండి పట్టు పట్టిన కేంద్రాన్ని నిలదీయడానికి జాతీయ సామాజిక ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్ మెగా సిటీ విశాఖకు తరలివస్తున్నారు. ఈ నెల 30న విశాఖలో జరిగే అతి పెద్ద ఉద్యమ సభకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.
ఆమె మాట్లాడితే మెరుపులూ ఉరుములే కాదు నిప్పులే కురుస్తాయి. సెజ్ లకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన పోరాటం చేసి రైతాంగానికి మద్దతు ఇచ్చి వారి కడగండ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన మేధా పాట్కర్ ఇపుడు ఉక్కు నగరంలో కేంద్ర సర్కార్ ని నిగ్గదీయనున్నారు.
లెక్కలేనితనంతో ముందుకు పోతున్న కేంద్ర పాలకుల వైఖరి మీద ఆమె గర్జించనున్నారు. గాజువాక వేదికగా జరిగే అతి పెద్ద బహిరంగ సభలో మేధా పాట్కర్ కేంద్ర సర్కార్ విధాలాను గట్టిగానే ప్రశ్నిస్తారు అంటున్నారు. కేవలం ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రమే కాదు, దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా జాతి సంపదను లేకుండా చేస్తున్న దారుణ పోకడల మీద మేధా పాట్కర్ పెద్ద ఎత్తున గళమెత్తుతారని కార్మిక నాయకులు అంటున్నారు.
మేధా పాట్కర్ సభతో అయినా కేంద్రం విశాఖ వైపు చూస్తుందా, వారి నిరసనల సెగ ఢిల్లీ పాలకులకు వినిపిస్తుందా. అంటే కచ్చితంగా జరిగితీరుతుంది అని ఉక్కు కార్మిక లోకం గట్టి నమ్మకంతో ఉంది మరి.