సాధారణ అరోగ్య పరీక్షలు మాత్రమే అని ప్రకటించినప్పటికీ అభిమానులు నమ్మలేదు. రెగ్యులర్ చెకప్ కోసం హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదనేది వాళ్ల అనుమానం. వాళ్ల అనుమానమే నిజమైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
నిన్న చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రజనీకాంత్. ఆ టైమ్ లో తీవ్రమైన తలనొప్పితో ఆయన బాధపడ్డారు. దీనిపై పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం, అతడి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించారు. ఈ రోజు చిన్నపాటి సర్జరీ నిర్వహించి ఆ నాళాన్ని సరిచేశారు.
రజనీకాంత్ కు సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, కొన్ని రోజులు హాస్పిటల్ లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు.
కొన్నేళ్ల కిందటే రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విదేశాల్లోనే వైద్యపరీక్షలు, ఆపరేషన్ పూర్తిచేసుకొని ఇంటికొచ్చారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తను నటించిన తాజా చిత్రం అన్నాత్తై (పెద్దన్న)ను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.
ఆ రాత్రి బాగానే నిద్రపట్టింది. గురువారం ఉదయం నుంచి కొంచెం తలనొప్పి ప్రారంభమైంది. అది ఎప్పటికీ తగ్గకపోవడంతో హుటాహుటిన కావేరీ హాస్పిటల్ కు తరలించారు.