గుంటూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. మరికొందరు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు ప్రచార యావే ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంటోందని మండిపడ్డారు. బాబు ప్రచార యావకు గుంటూరు జిల్లాలో ముగ్గురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో బాబు ప్రచార పిచ్చితోనే 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో పది రోజులుగా టీడీపీ ఫేక్ ప్రచారంతో హడావుడి చేసిందన్నారు.
కానుకల పంపిణీతో పేదల జీవితాలు మారుతాయనే దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందుతున్నారని విడదల రజినీ మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెట్టి చంద్రబాబు సభకు రప్పించుకున్నారని విమర్శించారు. మృతుల బంధువులతో మాట్లాడగా… చీర, చక్కెర, కందిపప్పు, నూనె కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నిర్వాహకుల ఫెయిల్యూర్‌తోనే ఈ ఘటన జరిగిందన్నారు.
చంద్రబాబు ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో జనం తన సభకు పెద్ద ఎత్తున వస్తున్నారని నమ్మించే కుట్రలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ధి రావాలని మంత్రి హితవు పలికారు. సభకు పోలీసులు తగిన బందోబస్తు ఇచ్చారన్నారు. పోలీసులు సకాలంలో స్పందించకుండా వుంటే మరిన్ని ప్రాణాలు పోయేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా వుండగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడిన మంత్రి…వారి ఆవేదన విని కంట తడి పెట్టారు. కానుకల పేరుతో తమను మభ్య పెట్టి చంద్రబాబు సభకు తీసుకొచ్చినట్టు బాధితులైన దళిత, బీసీ, మైనార్టీ మహిళలు మంత్రితో తమ గోడు వెల్లబోసుకున్నారు. క్షతగాత్రులకు ఆమె ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.