బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రాజకీయ రంగు పులుముకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వచ్చినప్పుడు అనేక మంది కుంగుబాటు, బాలీవుడ్ లో బంధుప్రీతి వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత చాలా లేటుగా ఈ అంశంపై బిహార్ లో కేసులు నమోదయ్యాయి! ఆ తర్వాత ఇది బిహార్ ప్రభుత్వం వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసుగా మారినట్టుగా జనాలకు అగుపిస్తోంది.
ఈ కేసులో రాజకీయ జోక్యం పై రకరకాల కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యఠాక్రే పేరు ఈ వ్యవహారంలో వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. సుశాంత్ ఆత్మహత్యకూ ఆదిత్య ఠాక్రేకూ లింక్ ఉందట! ఒక సినిమా స్టోరీలా అందుకు సంబంధించి కొన్ని కథనాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అందులో వాస్తవాలు ఏమిటో ఎవరికీ తెలీదు!
ఒకవైపేమో అసలు సుశాంత్ ది ఆత్మహత్యే కాదు హత్య అని కొంతమంది అంటున్నారు. మరి కొందరేమో సుశాంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ అతడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పించారని అంటున్నారు! మధ్యలో రియా చక్రబర్తి- ఆదిత్య ఠాక్రే.. ఇలా ఒక బాలీవుడ్ సినిమా స్టోరీ తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా ఒక ఫేక్ ప్రొపగండా అని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొంతమంది ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే వాదనా వినిపిస్తూ ఉంది.
ఈ క్రమంలో రియా చక్రబర్తి తరఫు లాయర్ కోర్టులో వాదిస్తూ అసలు రియాకూ ఆదిత్య ఠాక్రేకూ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారట. ఈ కేసులో బిహార్ పోలీసుల జోక్యమే రాజకీయ ప్రోద్బలమని వాదించారట. మహారాష్ట్ర పోలీసులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య రోజు నుంచి ఈ కేసును ఫాలో అప్ చేస్తే 40 రోజుల తర్వాత వచ్చి బిహార్ పోలీసులు రచ్చ చేస్తున్నారని.. ఈ కేసులో విచారణ చేసే అధికారం వారికి లేనే లేదని కూడా రియా తరఫు లాయర్ వాదించినట్టుగా సమాచారం. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉన్నారు.
ఇటీవలే రియాను విచారించిన ఈడీ అధికారులు సుశాంత్ ఖాతా నుంచి ఆమె అకౌంట్ కు భారీగా డబ్బులేవీ ట్రాన్స్ ఫర్ కాలేదని తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో!