విశాఖ‌కు రాజ‌ధాని …గ‌డువు ఫిక్స్‌!

అభివృద్ధి, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని వైసీపీ వాద‌న‌. ఇది కేవ‌లం వాద‌నే కాదు, ఆచ‌ర‌ణ‌కు కూడా వైసీపీ ప్ర‌భుత్వం దిగిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని, అమ‌రావ‌తి శాస‌న‌,…

అభివృద్ధి, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని వైసీపీ వాద‌న‌. ఇది కేవ‌లం వాద‌నే కాదు, ఆచ‌ర‌ణ‌కు కూడా వైసీపీ ప్ర‌భుత్వం దిగిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని, అమ‌రావ‌తి శాస‌న‌, రాయ‌ల‌సీమలో న్యాయ‌రాజ‌ధాని ఏర్పాటు చేస్తూ బిల్లుల్ని కూడా అసెంబ్లీలో ప్ర‌భుత్వం ఆమోదించింది. అయితే ఇది ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేదు. ఏపీ హైకోర్టు తీర్పు జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని గొడ‌వ సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయ స్థానంలో ఏపీ ప్ర‌భుత్వానికి అనుకూల నిర్ణ‌యం వ‌స్తే త‌ప్ప మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం వుండ‌దు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంత కాలం ప‌డుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా వైసీపీ ముఖ్య నేత‌లు విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లింపుపై త‌లా ఒక మాట అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని త‌ర‌లింపుపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌డువు కూడా ఫిక్స్ చేశారు. విజ‌య‌న‌గ‌రంలో ఇవాళ నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని బొత్స స‌త్య‌నారాయ‌ణ కేక్ క‌ట్ చేశారు. కొత్త సంవ‌త్స‌ర సంబ‌రాల్లో ఆయ‌న పాలు పంచుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మూడు నెల‌ల్లో విశాఖ రాజ‌ధాని అవుతుంద‌ని గ‌డువు కూడా చెప్ప‌డం విశేషం. దీంతో ఏ భ‌రోసాతో బొత్స రాజ‌ధానిపై గ‌డువు చెప్పారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఒక‌వైపు విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని రాక‌పోతే ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని మ‌రో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మంత్రి బొత్స మాత్రం ఏకంగా మూడు నెల‌ల్లో విశాఖ‌కు రాజ‌ధాని వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించి స‌రికొత్త వివాదానికి తెర‌లేపారు. మొత్తానికి విశాఖ‌కు రాజ‌ధాని అంశం అంతా అయోమ‌యంగా వుంది. అస‌లేం జ‌రుగుతున్న‌దో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి. క‌నీసం గ‌డువు విధిస్తున్న వాళ్ల‌కైనా అర్థ‌మైతే చాలు.