ఎన్టీఆర్ అభిమానులకు న్యూ ఇయర్ వేళ మాంచి అప్ డేట్ పడింది. 2023 లో ఎన్టీఆర్ సినిమా విడుదల వుండదు అన్నది అప్ డేట్. 2024 ఏప్రిల్ లో ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా విడుదల అని ప్రకటించారు.
నిజానికి ఇప్పటికిప్పుడు ఈ డేట్ ఎందుకు అనౌన్స్ చేసినట్లో మేకర్స్ కే తెలియాలి. న్యూ ఇయర్ కు అప్ డేట్ ఇవ్వడం వరకు ఓకె. త్వరలో షూటింగ్ ప్రారంభం అనో లేదా ఫలానా డేట్ నుంచి షూటింగ్ ప్రారంభం అనో ఇస్తే సరిపోయేది. ఫ్యాన్స్ కూడా అంతకు మించి ఆశ పెట్టుకోలేదు. కానీ షూటింగ్ డేట్ చెప్పకుండా విడుదల డేట్ ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు.
దీని వల్ల ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. 2023 లో ఎన్టీఆర్ సినిమా వుండదని తెలిసిపోయింది. ఇప్పటికే బన్నీ-సుకుమార్ పుష్ప సినిమా 2023లో వుండదని వినిపిస్తోంది. మరోపక్క రామ్ చరణ్-శంకర్ సినిమా 2023 సమ్మర్ కు రావాల్సి వుంది.
ఏమాత్రం ఆలస్యం అయినా అంత భారీ సినిమాకు డేట్ దొరకడం కష్టం అవుతుంది. దసరా లాంటి సీజన్ ఆ సినిమాకు సరిపోదు. అందువల్ల ఆలస్యం కాకుండా వుండాలి. లేదూ అంటే ఎన్టీఆర్..బన్నీ..చరణ్ సినిమాలు 2023 లో వుండవు.
మహేష్..ప్రభాస్..పవన్..ల సినిమాలు 2023లో వుంటాయి. మహేష్ నుంచి ఒక్క సినిమానే వస్తుంది. ప్రభాస్ నుంచి ఒకటికి మించి ఆశించడం కష్టం కావచ్చు. పవన్ నుంచి మాత్రం రెండు సినిమాలు వుండే అవకాశం వుంది. మొత్తానికి 2023 అంతా మిడ్ రేంజ్ సినిమాలదే హవా కావచ్చు.