దర్శకుడు పూరీ జగన్నాథ్ సమ్‌థింగ్ డిఫరెంట్. ఆయన సినిమాలపై కంటే పూరీ చెబుతున్న మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలాసఫర్‌గా ఆయన చెబుతున్న మాటల్లోని అంతరార్థాన్ని వెతికే పనిలో ప్రజానీకం వుంది. పూరీ మ్యూజింగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైనా సరే… అందులో ఏదో ప్రత్యేకత వుండేలా పూరీ చెబుతున్నారు. పూరీ మార్క్ మ్యూజింగ్స్ సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. లోతైన అర్థంతో, కఠిన జీవిత సత్యాలతో పూరీ ఔరా అనిపించుకుంటున్నారు.
ఇవాళ న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని పూరీ మ్యూజింగ్స్‌లో తనదైన ముద్ర వేసే జీవిత సూక్తులు చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ నౌ హియర్’ (Happy now Here) పాడ్కాస్ట్ని విడుదల చేశారు. పేరులోనే పూరీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. హ్యాపీ న్యూ ఇయర్‌కు బదులు హ్యాపీ నౌ హియర్గా పేర్కొనడం పూరీలోని తత్వవేత్తను గుర్తు చేస్తోంది. ఆనందాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలనేది ఆయన ఫిలాసఫీ. రేపటి కోసం ఈ రోజు ఆనందాన్ని పక్కన పెట్టేయకూడదని ఆయన తాజా మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చారు.
దమ్ముంటే ఈరోజే ఆనందాన్ని కుమ్మేయ్ అని పూరీ సవాల్ విసరడం గమనార్హం. ఆనందంగా వుండడానికి మరో సంవత్సరం వరకూ ఎదురు చూడడం దేనికి? అని ఆయన ప్రశ్నిస్తున్న తీరును విస్మరించలేం. చెడు అలవాట్లను మానేయడం, అలాగే మంచి అలవాట్లను ప్రారంభించేందుకు జనవరి 1వ తేదీని టార్గెట్‌గా పెట్టుకోవడం దేనికనేది ఆయన ప్రశ్న.
హ్యాపీగా వుండడం తెలియని వాళ్లే ఏదేదో చేస్తుంటారని ఆయన సున్నితంగా మొట్టికాయలు కూడా వేశారు. మారిపోవాలనే ఆలోచన వుంటే… దానికి ఈ క్షణం నుంచే శ్రీకారం చుట్టాలని పూరీ ఆదేశించడం గమనార్హం. ఆనందం అనేది భవిష్యత్‌లో కాదు వర్తమానంలోనే వుంటుందనే ఉద్దేశంతో… హ్యాపీ నౌ హియర్ అంటూ దర్శకుడు పూరీ జనాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు.