అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఆ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు వెంటనే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే, ఏజెంట్ షూటింగ్ కు చాలా టైమ్ పట్టేలా ఉంది.
అలా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఏజెంట్ సినిమాను సమ్మర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సమ్మర్ రిలీజ్ అంటూ ప్రకటించారు.
సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంది. దాదాపు 40 రోజుల పాటు దాన్ని షూట్ చేశారు. ఆ ఎపిసోడ్ కు చెందిన మేకింగ్ వీడియోను ఈ రోజు విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అదనంగా ఈ మేకింగ్ వీడియో వచ్చింది.
వీడియోలో యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు అఖిల్. గూఢచారిగా అతడి మేకోవర్ బాగుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సమ్మర్ లో పాన్ ఇండియా లెవెల్లో ఏజెంట్ ను విడుదల చేయబోతున్నారు. అలా అఖిల్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా కూడా ఏజెంట్ నిలవనుంది.