భారీ అంచనాలతో 2023లోకి అడుగుపెట్టింది టాలీవుడ్. గతేడాదిలానే ఈ ఏడాది కూడా చాలా మెరుపులున్నాయి. పాన్ ఇండియా లెవెల్ కు చేరుకున్న టాలీవుడ్ ను, మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. అలా ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ ఏంటో చూద్దాం..
ప్రతి ఏటా ఉన్నట్టే, ఈ ఏడాది కూడా మెస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లిస్ట్ సంక్రాంతి సినిమాల నుంచే మొదలవుతుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి-బాలకృష్ణ పోటీపడుతున్నారు. చిరు నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ గ్రాండ్ గా ఓపెన్ కాబోతోంది. ఈ రెండు సినిమాల్లో దేనిది పైచేయి అనే విషయంపై ఇప్పటికే ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ సంక్రాంతి సినిమాలతో పాటు ఈ ఏడాదిలోనే మరో 2 సినిమాలతో అలరించబోతున్నారు చిరు-బాలయ్య. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న భోళాశంకర్ సినిమా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి.
ఇక మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ ముందుగా థియేటర్లలోకి రాబోతోంది. ఆ తర్వాత ఏడాది చివరి నాటికి సలార్ కూడా థియేటర్లలోకి వస్తోంది. అలా ఈ ఏడాది ప్రభాస్ నుంచి 2 సినిమాలు చూడబోతున్నాం.
2023లో మరో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మహేష్-త్రివిక్రమ్ సినిమా. అప్పుడెప్పుడో వచ్చిన ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. మేకర్స్ ఆల్రెడీ ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ ఆ టైమ్ కు సినిమా రాదు. అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుంది.
ఇలాంటిదే మరో క్రేజీ కాంబినేషన్ రామ్ చరణ్, శంకర్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది సమ్మర్ కు లేదా ఆగస్ట్ లో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందంటున్నారు. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.
ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప-2 కూడా షూటింగ్ మోడ్ లో ఉంది. మ్యాగ్జిమమ్ ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుంది. కానీ సినిమాను విపరీతంగా చెక్కే సుకుమార్ ను నమ్మలేం. వస్తే వచ్చినట్టు, లేదంటే లేదు. ఆల్రెడీ పుష్ప సినిమా ఇండియా లెవెల్లో పెద్ద హిట్టవ్వడంతో, పుష్ప-2పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
పవన్ కల్యాణ్ నుంచి కూడా ఈ ఏడాది ఓ సినిమా రాబోతోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను సమ్మర్ తర్వాత విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వీళ్లతో పాటు నాని చేస్తున్న దసరా, రవితేజ రావణాసుర, నాగచైతన్య కస్టడీ, రామ్-బోయపాటి సినిమాలు కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి వస్తున్నాయి. అటు సూపర్ హిట్ డీజే టిల్లూ సీక్వెల్ కూడా ఇదే ఏడాది అలరించబోతోంది. ఇప్పటివరకు అధికారికంగా ఈ ఏడాదిని మిస్సయిన స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది తారక్ మాత్రమే.