లైంగిక ఆరోపణలపై మంత్రి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. జూనియర్ కోచ్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా హరియాణాలో క్రీడలశాఖ మంత్రి సందీప్‌సింగ్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి, బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సదరు మంత్రి ఒకప్పుడు భారత జాతీయ హాకీ జట్టుకు నాయకత్వం వహించడం గమనార్హం.
హాకీ ప్లేయర్‌గా సందీప్‌సింగ్‌కు మంచి పేరు వుంది. క్రీడల్లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. హర్యాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అతన్ని మంత్రి పదవి వరించింది. క్రీడాకారుడైన సందీప్ సింగ్‌కు సంబంధిత శాఖ మంత్రిత్వ బాధ్యతల్ని అప్పగించారు. అయితే అతను మహిళల జీవితాలతో ఆట ఆడేందుకు ప్రయత్నించడం విమర్శలకు దారి తీసింది.
తనను లైంగికంగా వేధించాడని అదే రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. సదరు మంత్రితో మొదటిసారి జిమ్ వద్ద పరిచయం అయినట్టు కోచ్ చెప్పారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో, స్నాప్‌చాట్‌లో తనకు అభ్యంతరకర మెసేజ్‌లో పంపేవాడని వాపోయారామె. ఒక రోజు ఆఫీస్‌కు రావాలని పిలిచి, అసభ్యంగా ప్రవర్తించాడని, ఎలాగోలా తప్పించుకుని బయటపడినట్టు కోచ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అతనిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోచ్ ఆరోపణల్లో వాస్తవం లేదని సందీప్ సింగ్ చెబుతున్నారు. కేవలం రాజకీయంగా తనను దెబ్బ తీయడానికే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిజానిజాలేంటో పోలీసుల విచారణలో తేలనుంది.