ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలో తీవ్రస్థాయిలో వున్నాయి. ఇటీవల ఆ జిల్లా ఇన్‌చార్జ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో భాగంగా వైసీపీలో విభేదాలు రోడ్డెక్కాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నేతల మధ్య నువ్వా, నేనా అన్న స్థాయిలో గొడవలున్నట్టు తేలిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరికలను పట్టించుకునే దిక్కులేదు.
ఇవాళ మరోసారి హిందూపురం వైసీపీలో అసమ్మతి నేత ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా గళం విప్పడం చర్చనీయాంశమైంది. వైసీపీ అసమ్మతి నేత, ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ మీడియాతో మాట్లాడుతూ హిందూపురంలో వలసదారులకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. వసలదారులను వైసీపీ కార్యకర్తలే తరిమికొట్టాలని పిలుపునివ్వడం గమనార్హం.
వలసదారులతో కార్యకర్తలకు, పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్య చేశారనే చర్చకు తెరలేచింది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వలసదారులంతా పార్టీ వీడుతారని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ది కర్నూలు జిల్లా. ఇక్బాల్‌తో హిందూపురం వైసీపీ నేతలకు అసలు పొసగడం లేదు.
హిందూపురం వైసీపీలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… ముఖ్య నాయకుడైన రామకృష్ణారెడ్డిని హత్య చేసేంత. ఇటీవల రామకృష్ణారెడ్డి హత్య వైసీపీలో తీవ్ర అలజడి రేపింది. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.