ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలో ఒక్కసారిగా అసంతృప్తి పొంగింది. ఇవాళ నూతన సంవత్సర వేడుకను పురస్కరించుకుని ఖమ్మంలో తన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. అనుచరులతో కలిసి నూతన సంవత్సర వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తనలోని ఆవేదన, ఆగ్రహాన్ని వెళ్లగక్కడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
2014లో వైసీపీ తరపున ఖమ్మం నుంచి శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ నిరాకరించారు. అయినప్పటికీ అదే పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సంచలన కామెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో తనకు దక్కిన గౌరవం ఏంటని పొంగులేటి ప్రశ్నించడం గమనార్హం. అలాగే భవిష్యత్‌లో ఆ పార్టీలో దక్కే గౌరవం ఏంటో ఆలోచించాలని అనుచరులకు విజ్ఞప్తి చేయడం విశేషం. గత నాలుగున్నరేళ్లలో తనకు కలిగిన ఇబ్బంది ఏంటో తెలియంది కాదన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీ అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. తనతో పాటు అర్హులైన అనుచరులు కూడా ఎన్నికల బరిలో వుంటారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అభిమానం పొందిన ప్రతినేత ప్రజాప్రతినిధి కావాలని పొంగులేటి ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు కోరుకున్నట్టుగా తాను చేసి చూపిస్తానన్నారు.
బీఆర్ఎస్‌లో పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన మాటలే తెలియజేస్తున్నాయి. కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో సంబంధం లేకుండా బరిలో నిలుస్తాననే సంకేతాల్ని ఆయన పంపారు. బీఆర్ఎస్‌లో ఆయన కొనసాగడంపై అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను బీజేపీ దగ్గరికి తీసుకుంటుందా? లేక బీఆర్ఎస్ వెనక్కి తగ్గి పొంగులేటికి తగిన ప్రాధాన్యం ఇస్తుందా? …. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకుంది.