ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రధానంగా కులం చుట్టూ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జగన్‌పై కాపు అస్త్రాన్ని ప్రయోగించడానికి వృద్ధనేత , మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యను ప్రతిపక్షాలు బరిలో దింపనున్నాయి. కాపు రిజర్వేషన్ల పేరుతో ఆయనతో నిరాహార దీక్ష చేయించేందుకు ముఖ్యంగా జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ శ్రేయోభిలాషిగా హరిరామజోగయ్య పలు సందర్భాల్లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
కాపుల రిజర్వేషన్లపై టీడీపీ నోరు మెదపడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ చేయడానికి టీడీపీ నేతలు భయపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడితే బీసీల ఓట్లు పోతాయనే భయం ఆ పార్టీ నేతల నోరు మూయిస్తోంది. గతంలో చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని సమయంలో హరిరామజోగయ్య ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం “నా జాతి” అంటూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు.
చంద్రబాబు ప్రభుత్వం చేతిలో తీవ్రంగా అవమానపాలయ్యారు. కుటుంబ సభ్యుల్ని పోలీసులతో అసభ్యంతా తిట్టించారు. ముద్రగడ కుమారుడిని పోలీసులతో చితకబాదించారు. ఈ విషయాలన్నీ పలు సందర్భాల్లో ముద్రగడ ఆవేదనతో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద పది శాతం రిజర్వేషన్లను కేటాయించింది. ఇందులో ఐదు శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కాపులకు కేటాయించింది.
గత ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లపై జగన్ స్పష్టత ఇచ్చారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, తన చేతల్లో లేదని తేల్చి చెప్పారు. అయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వుందని ఇటీవల రాజ్యసభలో మంత్రి చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్‌కల్యాణ్ తన సామాజిక వర్గం కోసం ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో హరిరామజోగయ్యను రంగంలోకి దింపడం గమనార్హం. కాపులకు రిజర్వేషన్లపై తేల్చాలని గత నెల డిసెంబర్ 31 వరకూ చేగొండి రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. హరిరామజోగయ్య హెచ్చరికలను జగన్ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్‌పై తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నది సీఎం అభిప్రాయం. అంతేకాదు, గత ఎన్నికల ముంగిట రిజర్వేషన్లు ఇవ్వలేనని తేల్చి చెప్పడాన్ని సీఎం గుర్తు చేస్తున్నారు.
అయితే కాపుల రిజర్వేషన్ల పేరుతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు హరిరామజోగయ్యను రంగంలోకి దింపారనేది జగమెరిగిన సత్యం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడంలో జగన్ ఆరితేరారు. ప్రత్యర్థులు తనపై ప్రయోగిస్తున్న కాపు అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు బీసీల ఆయుధాన్ని సీఎం సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టి కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ జగన్ బలంగా ప్రచారం చేసేందుకు వ్యూహాల్ని రచించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన హరిరామజోగయ్య దీక్షను జగన్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ కొట్టే దెబ్బలు తిన్నవారికే తెలుస్తుంది. అందుకే కాపుల రిజర్వేషన్లపై టీడీపీ ఆచితూచి అడుగులేస్తోంది.