వల్లభనేని వంశీ తెలుగుదేశాన్ని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పంచన చేరడానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా అవస్థలు పడ్డారు. కానీ, అవన్నీ తేలిపోయాయి. నిష్ప్రయోజనం అయ్యాయి. బాబుకు ప్రచారం మాత్రమే మిగిలింది. పని జరగలేదు. వల్లభనేని వంశీమోహన్.. ఆది, సోమ వారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైనట్లే.
వల్లభనేని వంశీకి ఎప్పటినుంచో జగన్ తో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పాలనలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ బంధాలను దాచుకోవడానికి ప్రయత్నించలేదు. తాను తెలుగుదేశంలోనే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో జగన్ ను కలిశారు కూడా.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం తిరగబడి, వైకాపా పాలన మొదలయ్యేనాటికి వంశీ తెదేపా ఎమ్మెల్యేగా మిగిలారు. తెదేపాలో భవిష్యత్తు ఉండదనే సంగతి వరకు ఖరారుగా నిర్ణయించుకున్న వంశీ, భాజపాలోకి వెళ్లడమా? వైకాపాలో చేరడమా? అనే మీమాంసకు గురైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు ఆయన జగన్ ను కలిసి వైకాపాలో చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సహజంగానే.. గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
ఉప ఎన్నికల్లో టికెట్.. పాత అభ్యర్థి వెంకట్రావుకే ఇస్తారని.. ఆయన గెలిచాక, వంశీని ఎమ్మెల్సీ చేస్తారని.. తద్వారా.. జగన్ తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయడాని నిరూపించుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాలేవీ సహజంగానే చంద్రబాబుకు మింగుడపడలేదు. వంశీ పార్టీ వీడిపోతే.. తమ పరువు ఎంత దిగజారుతుందో ఆయనకు బాగా తెలుసు. పార్టీకి రాజీనామా చేస్తూ వంశీ రాసిన లేఖను ఆయన రాజకీయం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు భరించలేకనే రాజకీయాలు మానుకోదలచుకున్నట్లుగా రంగు పులిమి.. కొత్త ఎత్తుగడ వేశారు. వంశీకి ధైర్యం చెబుతున్న ముసుగులో.. వంశీని బుజ్జగించేందుకు ఆయన రాయబారాలు సాగించారు.
రాయబారాలకు వెళ్లిన వారికి కూడా వంశీ అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు రెండు లేఖలు రాసి, ఆ లేఖలను మీడియాకు విడుదల చేసి.. తద్వారా.. ప్రజల దృష్టిలో సానుభూతి పొందేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. ఆ పాచికలేవీ పారలేదు.
తెలుగుదేశం పార్టీకి ఇదివరకే రాజీనామా చేసిన వంశీ… చిట్టచివరికి వైకాపాలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.