జగన్ ప్రభుత్వం మీడియాకు ముకుతాడు బిగించడానికి.. జీఓ 2430 తీసుకువచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పట్లో తెచ్చిన జీవోకు కొన్ని సవరణలతో కొత్త జీవో వచ్చింది.
మీడియాలో నిరాధార కథనాలు వస్తే.. వాటికి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి వివిధ శాఖల కార్యదర్శులకు ఈ జీవో అధికారం కట్టబెడుతుంది.
ఈ చట్టం ప్రింట్, టీవీ, ఆన్‌లైన్ మూడు రకాల ఫార్మాట్లలోని మీడియాకు కూడా వర్తిస్తుంది. పేపర్లూ చానెళ్లూ భయపడాలి… వాట్సాప్‌లో బురద చల్లుకుంటూపోతే.. ఎప్పటికి కనిపెడతార్లే, ఎందరిపై కేసులు పెడతార్లే అనుకుంటే కుదర్దు.
సహజంగానే మీడియాను కంట్రోల్ చేయడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని.. కలాలకు సంకెళ్లు వేస్తున్నదని, తమ వైఫల్యాలను ఎత్తిచూపుతోంటే సహించలేకపోతున్నదని రకరకాల వ్యాఖ్యలు ఈ జీవోకు వ్యతిరేకంగా వస్తున్నాయి.
ప్రభుత్వం ఏమీ చేయకపోయినా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నట్లుగా కొన్ని పత్రికలు పనిగట్టుకుని మోస్తుంటాయి. అలాంటి వారికి ఇలాంటి ఖచ్చితమైన నిబంధనలు ఉండే చట్టం కంటగింపే.
అలాంటి పత్రికలను కాపాడడానికే.. వారికి చట్టంతో జరిగే చేటు ఏమీలేకపోయినా.. మొసలి కన్నీళ్లు కార్చడానికి.. ఆక్రోశం వెళ్లగక్కడానికి.. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ముందు వరుసలో ఉంటారు.
సాధారణంగా సోషల్ మీడియా అంటేనే విచ్చలవిడి తనానికి నిదర్శనం. జవాబుదారీతనం వహించరు గనుక.. ఎడాపెడా రాసేస్తుంటారు.
నిన్నటిదాకా ప్రింట్, టీవీ చానెళ్లు కొంత హద్దులు పాటిస్తుండేవి. ఇవాళ్టి రోజుల్లో వెబ్ మీడియా పోటీకి తట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా.. ఆ హద్దులు చెరిపేసుకుని ప్రింట్, టీవీ మీడియాల వారు కూడా ఏదో తోస్తే అది, ఏది స్పైసీగా ఉంటే అది రాయడం అలవాటు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా ఉండే రాతలు కూడా వీటిలో కలిసిపోతున్నాయి.
జి.ఒ. 2430 ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు రాతలకు కత్తెర వేస్తుంది. అయితే విచ్చలవిడిగా బురద చల్లి, అబద్ధాల ప్రచారంలో ఆత్మానందం పొందేవాళ్లు.. కాస్త జాగ్రత్త వహించక తప్పదు.