ఈ తెలివి ముందు లేకపోయేనే పవన్ జీ!

ఇసుక సరఫరా విషయంలో జగన్ సర్కారు విఫలమైంది. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఈ వైఫల్యాన్ని వీలైనంత ఎక్కువగా కేష్ చేసుకోడానికి విపక్ష పార్టీలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి. పైగా ఖర్మ ఏంటంటే.. ప్రభుత్వంలో చురుకు…

ఇసుక సరఫరా విషయంలో జగన్ సర్కారు విఫలమైంది. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఈ వైఫల్యాన్ని వీలైనంత ఎక్కువగా కేష్ చేసుకోడానికి విపక్ష పార్టీలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి. పైగా ఖర్మ ఏంటంటే.. ప్రభుత్వంలో చురుకు పుట్టించాలి… సమస్య తీరాలి.. ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావాలి… కార్మికుల కష్టాలు తీరాలి అనే లక్ష్యాలకంటె.. ఎవరికి వారు తమ పార్టీల మైలేజీకోసం దీనిని వాడుకోవడానికి ఈ సమస్యను వాడుకుంటున్నాయి.

భాజపా, తెలుగుదేశం కూడా ఇసుక సమస్యను ఎత్తిచూపుతూ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. కాకపోతే.. పవన్ కల్యాణ్ వారిని మించిన మైలేజీని కోరుకున్నారు. నవంబరు మూడోతేదీన ఆదివారం విశాఖలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి లాంగ్ మార్చ్ ప్లాన్ చేశారు. సమస్య రాష్ట్రమంతా ఉండగా.. ఒక మూలన ఒక మార్చ్ నిర్వహించడం ద్వారా రాష్ట్రమంతా చైతన్యం తీసుకురావడం ఎలా సాధ్యమని ఆయన భావించారో తెలియదు. దానితో పోలిస్తే.. తెలుగుదేశం ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలే ఎక్కువ ఆలోచన కలిగిస్తాయి.

తీరా.. మార్చ్‌కు పిలుపు ఇచ్చిన తర్వాత.. పవన్‌కు భయం మొదలైనట్లుంది. జనసమీకరణ తేలిపోతుందేమోనని అనుకుంటున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీలు తమ మార్చ్‌కు సంఘీభావం తెలియజేయాలని ఆయన కోరుతున్నారు. ఇసుక సమస్యపై అన్ని పార్టీలు కలసి పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబు ఒప్పుకున్నట్లుగా జనసేన అంటోంటే.. పవన్‌తో వేదిక పంచుకోం అని కమల నాయకులు అంటున్నారు.

అదంతా ఒకఎత్తు అయితే.. ప్రజల సమస్యపై అందరూ కలిసి పోరాడాలనే తెలివిడి పవన్‌కు ముందే ఎందుకులేదు. తెలుగుదేశం చేసిన పోరాటాలకు ఆయన సంఘీభావం తెలిపి ఉంటే ఎంత పద్ధతిగా ఉండేది. చివరికి లోకేష్ దీక్షకైనా ఆయన కనీసం ట్విటర్ ద్వారా మద్దతు తెలిపి ఉండవచ్చు. అలాకాకుండా.. ఇతరులు దీక్షలు చేసినప్పుడు తన పార్టీ తరఫున పట్టించుకోకుండా.. తమ మార్చ్‌కు జనం దొరకరనే భయం రాగానే.. ఇతర పార్టీల మద్దతు కోసం దేబిరించడం ఏం రాజకీయం అనిపించుకుంటుంది?

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే