బంగారం విషయంలో మోడీ సర్కారు కత్తిదూసింది. వ్యక్తుల వద్ద ఎంత బంగారు ఉండాలనే విషయంలో ఆదేశాలు జారీచేసి.. ఆ పరిమితికి మించిన బంగారం కలిగి ఉంటే.. వాటికి పన్నులు కట్టాలనే చట్టం తీసుకురావడానికి యోచిస్తున్నది. ఇదంతా కూడా నల్లధనం వెలికి తీయడానికి అనే ముసుగులోనే జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇదే మాదిరిగా.. నల్లధనం వెలికితెచ్చే మిష మీదనే.. చేసిన నోట్లరద్దు ఒక విఫలప్రయోగంగా నిలిచింది. పైగా దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది ప్రాణాలను బలి తీసుకుంది.
కానీ.. నల్లధనం విషయంలో సాధించింది ఒక్కశాతం కంటె తక్కువే. సున్న అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు బంగారం విషయంలో కూడా ప్రభుత్వం దుడుకుతనం మరో విఫలప్రయోగంగా మారే అవకాశం ఉంది. ప్రజల వద్ద నల్లధనం మొత్తం బంగారం రూపంలోకి మారిపోతున్నదని.. అది లెక్కతేలడం లేదని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ఇలాంటి కొత్త చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. పరిమితికి మించి బంగారం అనధికారికంగా, లెక్కలు చెప్పకుండా కలిగిఉంటే భారీ జరిమానాలు విధించే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
అనువంశికంగా కుటుంబాల్లో ముందుతరాల వారినుంచి బంగారం కానుకలుగా తర్వాతి తరాల వారికి సంక్రమించడం అనేది సాంప్రదాయంగా ఉండే మనదేశంలో… మోడీ సర్కారు వాటిని మదింపు చేయడానికి, పరిమితులు విధించడానికి… ఎలాంటి చేతావాతా గానీ నిర్ణయాలు తీసుకుంటుందో నని పలువురు బెంబేలెత్తుతున్నమాట నిజం. గతంలో కూడా ఇలాగే నల్లధనం పేరు చెప్పి నోట్లురద్దు చేశారు. కూటికి గతిలేని వారు.. కూలీ పనులు మానుకుని… ఏటీఎం క్యూలైన్లలో నిలుచున్న అనేక వేలమంది అక్కడే కుప్పకూలి మరణించిన సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగాయి.
అసలైన నల్లకుబేరులంతా చాలా హాయిగా ఉన్నారు. మింట్ లో ప్రింటయిన కొత్తనోట్లు, రిజర్వు బ్యాంకు నుంచే వేలకోట్ల మేర నేరుగా వారి ఇళ్లకు వెళ్లిపోయాయి. సామాన్యులు మాత్రం నానాచావూ చచ్చారు. దేశవ్యాప్తంగా తమ తమ పనులు, వృత్తులు, ఉద్యోగాలు మానుకుని క్యూలైన్లలో నిలుచకున్న ప్రజల పని గంటలను లెక్కవేస్తే.. భారతదేశపు జాతీయ బడ్జెట్ కు నాలుగైదు రెట్లు ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ఒక బుద్ధిహీనమైన, అనాలోచిత నిర్ణయం వల్ల ప్రభుత్వం.. అన్ని లక్షల కోట్ల మేర జాతీయ సంపదను వృథా చేసినట్లేనని ప్రజలు అనుకున్నారు.
ఇప్పుడు బంగారం ముసుగులో మరో ప్రహసనానికి తెరలేపారు. అసలైన కుబేరులకు దీనివల్ల కూడా కించిత్ నష్టం ఉండదు. దేశమంతా కలిపి.. ఓ వంద కిలోల బంగారం విలువగల నల్లధనం బయటకు వచ్చినట్లు ప్రకటించి.. ప్రభుత్వం చంకలు గుద్దుకోవచ్చు గాక.. కానీ.. కానీ జనసామాన్యానికి అంతకంటె పెను నష్టం జరుగుతుంది.