శివసేనకు చివరకు దక్కేది అదేనా!

ఉప ముఖ్యమంత్రి పదవి.. ఇదీ శివసేనకు దక్కబోయేదిలా ఉంది. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటితో పోలిస్తే ఇది మెరుగైన స్థితే. క్రితంసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడు శివసేనను మరీ పూచిక…

ఉప ముఖ్యమంత్రి పదవి.. ఇదీ శివసేనకు దక్కబోయేదిలా ఉంది. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటితో పోలిస్తే ఇది మెరుగైన స్థితే. క్రితంసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడు శివసేనను మరీ పూచిక పుల్లగా చూసింది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర వరకూ పొత్తులో పెద్దన్నగా ఉండాలన్న శివసేన లెక్కలకు బీజేపీ ఏమాత్రం విలువను ఇవ్వలేదు. మంత్రివర్గంలో కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.

అయితే ఈసారి బీజేపీకి సీట్లు దక్కాయి. స్థూలంగా కూటమికి ప్రజామద్దతు చాలావరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో కూడా ఆ రెండు పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ సూపర్ పవర్ గా ఉన్న నేపథ్యంలో సేన తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితుల్లో ఉంది.

ముందుగా సీఎం సీటును పంచుకోవాలి, మంత్రి పదవులు సగం పంచాలని శివసేన డిమాండ్ చేసింది. అయితే బీజేపీ మాత్రం ససేమేరా అంటోంది. కావాలంటే సేనకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేస్తామంటూ బీజేపీ వాళ్లు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. సీఎం సీటును ఇచ్చేదిలేదని, సగం మంత్రి పదవులు కూడా దక్కవని తేల్చి చెబుతున్నారు బీజేపీ నేతలు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపాదనకు శివసేన తలొగ్గక తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కొంతలో కొంత ఆనందం ఏమిటంటే.. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి. ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకే ఆ పదవి దక్కే అవకాశాలున్నాయి. సేనకు బహుశా ఆ ఆనందం దక్కవచ్చునేమో!

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే