లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీడేస్, ఫిదా.. ఇలా తన సినిమాలకు క్యాచీ టైటిల్స్ పెడుతుంటాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాకు కూడా ఇలాంటి ఓ మంచి టైటిల్ నే ఫిక్స్ చేశాడు. అవును.. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాడు ఈ దర్శకుడు.
నిజంగా ఇది ప్రేమకథే. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ లో కలుసుకుంటారు. వీళ్లలో అమ్మాయి (సాయిపల్లవి)కి డాన్స్ అంటే ప్రాణం. అబ్బాయిది ఎదగాలనే తపన. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి తమ ప్రయాణాన్ని ఎలా సాగించారు, అనుకున్న లక్ష్యాల్ని ఎలా అందుకున్నారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే దీనికి లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నాడు కమ్ముల.
ఈ సినిమా కోసం నాగచైతన్య స్పెషల్ ట్రయినింగ్ తీసుకుంటున్నాడు. అది కూడా శేఖర్ కమ్ముల దగ్గరే. ఫిదా కోసం తెలంగాణ యాసలో ఎలా మాట్లాడాలో సాయిపల్లవికి నేర్పించిన కమ్ముల, ఇప్పుడీ లవ్ స్టోరీ కోసం నాగచైతన్యకు తెలంగాణ యాస నేర్పిస్తున్నాడు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ సినిమాను డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి వాయిదావేశారు. లెక్కప్రకారం ఈ సినిమాను డిసెంబర్ మూడోవారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ లో పడడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు.