వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ తక్షణం స్పందించి నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఇది. విశాఖను రాజధానిగా ప్రకటించకపోతే.. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా అయినా చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పిన మాటలు పార్టీకి పెద్ద నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఆయనేదో మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతున్నానని అనుకుని ఈ మాట చెప్పి ఉండవచ్చు. విశాఖను పరిపాలన రాజధాని చేయకపోతే ప్రజల హృదయాలు గాయపడతాయని తెలియజేయడానికి ఈ మాట చెప్పి ఉండవచ్చు. కానీ.. ‘రాజధాని కాకపోతే రాష్ట్రం’ అని డిమాండ్ చేయడం ద్వారా ఆయన చాలా పెద్ద తప్పు చేశారు.
ఒకసారి ‘ప్రత్యేకరాష్ట్రం’ అనే పురుగును ఉత్తరాంధ్ర ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి ప్రయత్నించిన తర్వాత.. ధర్మాన ప్రసాదరావు ఆ తప్పును దిద్దుకోవడం చాలా కష్టం. ఆయన ఈ మాటల వలన.. ‘విశాఖ పరిపాలన రాజధాని’ అనే మాటను తతిమ్మా యావత్ రాష్ట్ర తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.
ఎందుకంటే.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉంది. చంద్రబాబు లాంటి ముందు చూపు లేని నాయకులు.. అభివృద్ధి మొత్తం ఆ ఒక్క నగరంలోనే కేంద్రీకరించి.. అన్ని పనులు చేయించారు. తీరా నగరం బీభత్సంగా అభివృద్ధి చెందిన తర్వాత.. తెలంగాణ ప్రాంతం వారంతా.. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. సీమాంధ్రుల పెత్తనం ఎక్కువైపోయింది.. అనే పోరాటం ప్రారంభించి నెగ్గారు. అంతకాలం అందరూ కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాదు తెలంగాణలో భాగంగా ఉండిపోయింది. చేతులూపుకుంటూ సీమాంధ్రులు తమ ప్రాంతానికి వెళ్లిపోయి.. అగచాట్లు పడుతున్నారు.
ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. విశాఖను రాజధానిగా బీభత్సంగా అభివృద్ధి చేసిన తర్వాత.. ఇదే ధర్మాన అప్పుడు మళ్లీ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. సీమ వాళ్ల పెత్తనం ఎక్కువైపోయింది అనే డిమాండ్ తెరపైకి తేకుండా ఉంటారని గ్యారంటీ ఏముంది. తాను కాకపోయినా ఇతరులతో అయినా అలాంటి వాదన తెరపైకి తెస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా విశాఖ నగరంలో చేసిన అభివృద్ధి అక్కడే ఉండిపోతుంది. సీమవాళ్ల పెత్తనం మాకొద్దు అంటూ.. అప్పట్లో తెలంగాణ వాళ్ల మాదిరిగా ఉత్తరాంధ్రవారు పోరాడి.. మాకు రాష్ట్రం కావాలని గొడవ చేస్తారు. మళ్లీ ఊపుకుంటూ మిగిలిన ప్రాంతాల వారు వెళ్లిపోవాలి. ఇలాంటి ప్రమాదం ఉంటుంది.
ధర్మాన ప్రత్యేక రాష్ట్రం మాట ఎత్తిన తర్వాత.. ఈ భయం మిగిలిన ప్రాంతాల వారిలో ఉంటుంది. ఆ ప్రాంతాల వాళ్లంతా వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తే అది పార్టీకి చాలా నష్టం చేస్తుంది. ఆ రకంగా ధర్మాన ముందుచూపులేని మాటలు.. పార్టీకి మరణశాసనం రాసే ప్రమాదం ఉంది. తక్షణం పార్టీ నష్టనివారణ చర్యలు తీసుకుంటే తప్ప కుదరదు.