ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవికి కోపం వుందా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. చిరంజీవి తాజా వ్యాఖ్యలు ఆ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి చిరంజీవి, జగన్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయనేది లోకం మాట. చిరంజీవిపై జగన్ ప్రత్యేక అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకున్నారు. చిరంజీవి దంపతులను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. అన్నా అంటూ తనను ఎంతో ఆదరణ భావంతో జగన్ మాట్లాడ్తారని చిరంజీవి బహిరంగంగా ప్రకటించడం విన్నాం.
కానీ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మాత్రం జగన్ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. అది కూడా పవన్ విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో పవన్‌పై సీఎం దూకుడుగా వెళుతున్నారనే సంగతి తెలిసిందే. ఇదంతా రాజకీయపరమైందే. కానీ తమ్ముడిపై పరుష వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నట్టు కొత్త ఏడాది సందర్భంగా చిరంజీవి మనసులో మాట బయటపడింది. ఈ మధ్య కాలంలో పవన్ భార్యల గురించి జగన్ ర్యాగింగ్ చేస్తుండడాన్ని గమనించొచ్చు. బహుశా జగన్ తన తమ్ముడి వ్యక్తిగత జీవితం గురించి చేస్తున్న కామెంట్స్, బాధ, ఆవేదన కలిగిస్తున్నాయని చిరంజీవి పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్‌కల్యాణ్‌పై విమర్శలు మీకెలా అనిపిస్తాయనే ప్రశ్నకు చిరంజీవి సమాధానం తెలుసుకుంటే…. ముమ్మాటికీ జగన్‌పైనే ఈ అభిప్రాయం అని చెప్పక తప్పదని నెటిజన్లు అంటున్నారు.
‘మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పవన్‌ను తిట్టినవాళ్లు నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే, వాళ్లను కలవాల్సి వస్తోందే అని బాధగా వుంటుంది’ అని చిరంజీవి వేదనతో చెప్పుకొచ్చారు. పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ప్రత్యర్థిగా చూసేది వైసీపీనే. అధికార పార్టీపై పవన్ నిత్యం విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీపై చిన్న విమర్శ కూడా ఆయన చేయరు. పైగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే చిరు వ్యాఖ్యలు అంతిమంగా వైసీపీ నేతలు, ప్రధానంగా జగన్ గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సినీ రంగ సమస్యల పరిష్కారానికి జగన్ వద్దకే చిరు వెళ్లారు. అంతే తప్ప చిరంజీవి వద్దకు ఎప్పుడూ జగన్ వెళ్లకపోవడం గమనార్హం. జగన్‌పై చిరు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనేది మేధావుల అభిప్రాయం.