అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా అప్పుడెప్పుడో ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. ఆయన తనయుడు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే జేసీ దివాకర్ రెడ్డికి మాత్రం విరామం దొరుకుతున్నట్టుగా లేదు.
మళ్లీ పాత రాజకీయాలే. శింగనమల నియోజకవర్గంలో ఏదో చిన్న గొడవను పెద్దది చేయడానికి దివాకర్ రెడ్డి బయల్దేరాడట. అక్కడ వెంకటరెడ్డి అనే వ్యక్తి తన స్థలం పరిధిలో బండలు పాతుకున్నాడట. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సర్వేయర్ వెళ్లి సరిగ్గా కొలతలు వేసిచ్చాడు. బండలు పాతుకున్న వ్యక్తిది తప్పేం లేదని ప్రభుత్వాధికారి నిర్ధారించాడు.
అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు దానికి ఒప్పుకోవడం లేదు. ఆఖరికి ఒక చిన్న స్థలంలో, అది కూడా ప్రైవేట్ స్థలంలో బండలు పాతుకున్న వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి, అక్కడ రచ్చ లేపడానికి ఈ వృద్ధ రాజకీయ నేత బయల్దేరాడు. ఆయనకు తోడు శింగనమల మాజీఎమ్మెల్యే, ఇంకా ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడినామె.. అంతా బయల్దేరారు. మార్గంలోనే పోలీసులు వీరిని అపేశారు.
జేసీ కారు దిగకుండా మొరాయిస్తుంటే పోలీసులు ఎత్తుకెళ్లారు. అరగంటసేపు వీరిని వేరే రూటుకు తీసుకెళ్లి అక్కడ విడుదల చేసి ఇళ్లకు పంపించారు. ఇదీ కథ. మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి ఆఖరికి ఏ స్థాయికి వచ్చారో, ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో.. అంటూ ఆయన వీరాభిమానులు కూడా ఇప్పుడు వాపోతున్నారు పాపం!