ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘వైసీపీ వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్ (పీకే)లను ఆంధ్రజ్యోతి టార్గెట్ చేయబోయి నారా లోకేశ్ పరువు తీసింది. నారా లోకేశ్ అనే వ్యక్తి నాయకుడిగా పనికి రాడని ఆంధ్రజ్యోతి కథనం తేల్చేసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, లోకేశ్ నాయకత్వం అంటే టీడీపీ శ్రేణులు ఎంతగా భయపడుతున్నాయో ఈ కథనం ద్వారా ఆంధ్రజ్యోతి బయట పెట్టింది. చంద్రబాబునాయుడి నాయకత్వం తప్ప, ఆ పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేదనే వాస్తవాన్ని ఆంధ్రజ్యోతి లోకానికి చాటి చెప్పడం చర్చనీయాంశమైంది.
‘టార్గెట్ బాబు’ శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. తీరా కథనం అంతా చదివిన తర్వాత …‘టార్గెట్ లోకేశ్’ అని అర్థమవుతుంది. ప్రత్యర్థులను మట్టి కరిపించడానికి ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రకమైన వ్యూహం రచిస్తుంది. చంద్రబాబును జగన్ టార్గెట్ చేయడమే నేరంగా ఆంధ్రజ్యోతి తెగబాధ పడిపోయిందీ కథనంలో. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాన్ని, కుట్రను రచించిందని ఈ కథనంలో రాసుకొచ్చారు.
కొందరు అపరిచితులు టీ కొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనాన్ని ముచ్చట్లలోకి దింపుతారట! ‘ చంద్రబాబుకు వయసు పెరిగిపోయింది. ఈసారి ఎన్నికల్లో గెలిచినా ముఖ్యమంత్రిగా ఉండడు. ఆయన కుమారుడు లోకేశ్‌ను సీఎం చేస్తాడు!’ అనే మాట చెబుతారాట! దీంతో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్న జనమంతా ఆలోచనలో పడతారట! ఈ విధంగా జనం మైండ్ సెట్‌ని మార్చి రానున్న ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందేందుకు చంద్రబాబు వయసును టార్గెట్ చేస్తోందని ఆంధ్రజ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తూ కథనాన్ని అల్లింది.
‘నోటి మాట’ ప్రచారం అనే కొత్త అస్త్రాన్ని ఈ దఫా పీకే టీం ప్రయోగించబోతోందంటూ టీడీపీని భయపెట్టేలా కథనం సాగింది. వైసీపీ వ్యూహం సంగతేమో గానీ, లోకేశ్ నాయకత్వాన్ని గండికొట్టేలా ఈ కథనం సాగిందనడంలో అతిశయోక్తి లేదు. లోకేశ్ నాయకత్వం అంటే టీడీపీ శ్రేణులు ఎంతగా భయపడుతున్నాయో ఈ కథనమే నిదర్శనం.
లోకేశ్‌ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడానికి టీడీపీ, ఎల్లో మీడియా ఎంతగా భయపడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు వయసు పైబడుతోందన్నది నిజం. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఇంకా బాబు నాయకత్వమే తప్ప టీడీపీకి మరో దిక్కులేదనే ప్రచారం ముమ్మాటికీ ఆ పార్టీకి తీరని నష్టమే.
లోకేశ్ నాయకత్వాన్ని తెరపైకి తేవడం ద్వారా మరోసారి నష్టపోతామనే భయాందోళనను చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ఈ విధంగా వ్యక్తీకరించాయనే అనుమానాలు లేకపోలేదు. రచ్చబండ దగ్గరో, టీ కొట్టు దగ్గరో పీకే బృందానికి చెందిన అపరిచితుల నోటి మాట సంగతేమో గానీ, లోకేశ్ నాయకత్వం వద్దు అని ఆంధ్రజ్యోతి తెల్లారేసరికి కోడై కూసింది. పీకే టీం పనిని మరింత సులువు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీకే టీం నెమ్మదిగా తీసుకెళ్లేందుకు రెండేళ్ల సమయం పట్టేదేమో. కానీ ఆంధ్రజ్యోతి పుణ్యమా అని పీకే టీంకు సమయం కలిసొచ్చింది. ఎందుకంటే అబద్ధానికి ఉన్న ఆకర్షణ అందమైన ఆడవాళ్లకు కూడా ఉండదంటారు. ఒక్కోసారి చంద్రబాబుపై ఆంధ్రజ్యోతి ప్రేమ లోకేశ్‌పై ద్వేషంగా మారుతోంది. దానికి నిలువెత్తు నిదర్శనమే తాజా ‘టార్గెట్ బాబు’ కథనం.