కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి, రెండు రోజులు వేచి వుండి వెనక్కు వచ్చేసారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
గతంలో మోడీ, షా అపాయింట్ మెంట్ లు దొరికే వరకు ఢిల్లీకి వెళ్లేది లేదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అలాంటివి ఏవీ లేకుండానే ఢిల్లీ వెళ్లారు. వచ్చారు.
అయితే మోడీ, షా ల అపాయింట్ మెంట్ లు లేకపోవడం అన్నది భాజపా-తేదేపా-జనసేన కలిసి పోటీ చేస్తాయని వినవస్తున్న వార్తలకు గండి కొట్టేలా వుంది.
మరి ఎలా మేనేజ్ చేసారో లేదా అమిత్ షా నే చేసారో? లేదా అలా అని వార్తలు మాత్రమే వచ్చాయో..కొత్త వార్త బయటకు వచ్చింది. ఈ వార్త ఎటు వైపు నుంచి అధికారికంగా రాలేదు. పార్టీ వర్గాల బోగట్టా గానే ప్రచారం చేసేసారు.
అమిత్ షా స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసారని, పనుల వత్తిడి వల్ల అపాయింట్ మెంట్ ఇవ్వలేకపోయామని, త్వరలో కలుద్దామని చెప్పారన్నది ఆ వార్తల సారాంశం. అక్కడితో ఆగిపోతే ఈ వార్తల గొప్పదనం ఏముంది.
ఫోన్ లోనే చంద్రబాబు తాను ఎందుకు అపాయింట్ మెంట్ అడిగిందీ, ఆంధ్రలో నెల కొన్న పరిస్థితులు, గత రెండేళ్లుగా ఎల్లో మీడియాలో ఏ కథనాలు అయితే వస్తున్నాయో అలాంటివి అన్నీ ఫిర్యాదులుగా ఫోన్ లోనే ఏకరవు పెట్టేసారని వార్తలు వచ్చేసాయి.
మొత్తానికి అపాయింట్ మెంట్ దొరకని గాయానికి ఆయింట్ మెంట్ పూసినట్లు అనుకోవాలా? లేదా వీళ్లే పూసుకున్నట్లు అనుకోవాలా?