“ఏడాది ముగుస్తోంది, సినిమా ఇంకా చేతిలోనే ఉండిపోయింది, ఈ నెల దాటితే మళ్లీ రిలీజ్ డేట్ దొరకదు.” చాలా మంది చిన్న నిర్మాతలు ఇదే టెన్షన్ పడ్డారు. దీంతో డిసెంబర్ లో బాక్సాఫీస్ ముందు సినిమాలు క్యూ కట్టాయి. రికార్డ్ స్థాయిలో 5 శుక్రవారాల్లో 38 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే సంఖ్య బాగుంది కానీ, సక్సెస్ రేటు చాలా తక్కువ.
డిసెంబర్ లో బోణీ బాగుంది. అడివి శేష్ నటించిన హిట్-2 సినిమా హిట్ అయింది. నాని నిర్మాతగా శైలేష్ కొలను తీసిన ఈ సినిమా థియేటర్లలో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో పాటు వచ్చిన మట్టి కుస్తీకి కూడా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, అలాంటి టాక్ తో ఈ కాలం సినిమాలేవీ థియేటర్లలో నిలబడడం లేదు. ఈ సినిమాలతో పాటు వచ్చిన నేనెవరు, జల్లికట్టు బసవ లాంటి సినిమాలు పోయాయి.
రెండో వారంలో.. బాక్సాఫీస్ బరిలో ఏకంగా ఫిలింఫెస్టివల్ నడిచింది. లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీస్ పంచతంత్రం, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం మాత్రమే. బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించిన ఆంథాలజీ మూవీ పంచతంత్రం ఎమోషనల్ గా ఆకట్టుకున్నప్పటికీ,కలెక్షన్లు లేవు. ఇక సత్యదేవ్ ఎప్పట్లానే మరోసారి గుర్తుందా శీతాకాలంతో మరో ఫ్లాప్ ఇచ్చాడు. అటు గీతా కాంపౌండ్ అండతో వచ్చిన ముఖచిత్రం కూడా ఫ్లాప్ అయింది. చివర్లో వచ్చిన విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాడు.
డిసెంబర్ 16న.. శాసనసభ, ఆక్రోషం లాంటి సినిమాలతో పాటు విజువల్ వండర్ అవతార్-ది వే ఆఫ్ వాటర్ రిలీజైంది. ఊహించినట్టుగానే ఆ సినిమా మల్టీప్లెక్లుల్లో పెద్ద హిట్టయింది. ఆ తర్వాత బి, సి సెంటర్లలో కూడా అందుకుంది. అవతార్-2 తప్ప మరే మూవీ ఆ వారం ఆడలేదు.
ఇక నయనతార నటించిన కనెక్ట్, విశాల్ హీరోగా చేసిన లాఠీ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కనెక్ట్ మూవీ చాలామందికి కనెక్ట్ కాలేదు. లాఠీలో ఓవర్ ఎమోషన్ అయిపోయింది.
18-పేజెస్, ధమాకా రాకతో బాక్సాఫీస్ కు కళ వచ్చింది. అయితే నిఖిల్ నటించిన 18-పేజెస్ సినిమా అంచనాల్ని అందుకోలేక, చతికిలపడింది. మరోవైపు ధమాకా మాత్రం టైటిల్ కు తగ్గట్టే సూపర్ హిట్టయింది. రవితేజ-శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ ఏడాదికి మంచి ఫినిషింగ్ ఇచ్చింది.
ఏడాదికి చివరి శుక్రవారమైన 30వ తేదీన టాప్ గేర్, ఎస్5, డ్రైవర్ జమున, లక్కీ లక్ష్మణ్ లాంటి సినిమాలు కొన్ని రిలీజయ్యాయి. వీటిలో ఏ ఒక్కటీ క్లిక్ అవ్వలేదు. ఆది సాయికుమార్ నటించిన టాప్ గేర్ సినిమా, అతడికి మంచి ఫలితాన్నివ్వలేకపోయింది.
అలా డిసెంబర్ లో 38 సినిమాలు రిలీజ్ అయితే.. హిట్-2, ధమాకా, అవతార్-2 సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. కొత్త ఏడాదిలో ఏ సినిమా బోణీ కొడుతుందో చూడాలి.