మొత్తానికి గత కొద్ది గంటలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులు పూర్తయ్యాయి. ప్రభాస్ టీ సిరీస్ తో కలిసి ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నారని చాలా కాలం కిందటే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే నిన్నటికి నిన్నే ప్రభాస్ రామాయణంలో రాముడి పాత్ర చేయబోతున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండువార్తలు పక్కాగా నిజమయ్యాయి.
ప్రభాస్-టీసిరీస్ కలిసి 'ఆదిపురుష్' అనే సినిమా చేయబోతున్నారని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే రాముడి గెటప్ లో ప్రభాస్ ను చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఆ మధ్య అయోధ్య రామాలయ భూమి పూజ సందర్భంగా వాట్సాప్ లో చలామణీ అయిన ఏ టు జెడ్ అక్షరాల మాదిరిగా ఏ లెటర్ ను తయారు చేసి, అందులో కొన్ని మైథలాజికల్ బొమ్మలు ఇంపోజ్ చేసి అనౌన్స్ మెంట్ తో పాటు వదిలారు.
నిజానికి ఆదిపురుష్ ను ఇంగ్లీష్ లో aadipurush అని రాయడం అలవాటు..కానీ న్యూమరాలజీ ప్రకారం 10 లెటర్స్ అవుతాయి. అందుకే లక్కీ నెంబర్ 9 వచ్చేలా adipurush అని రాసినట్లు తెలుస్తోంది.
విల్లు ఆకాశంలోకి ఎక్కుపెట్టిన రాముడి గెటప్ ను, షాడో మాదిరిగా ఫస్ట్ లుక్ లో చూపించారు. మొత్తం మీద మరో రెండు మూడేళ్ల ప్రాజెక్టును ప్రభాస్ సెట్ చేసుకున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ చేసే రెండేళ్ల ప్రాజెక్టును ఓకె చేసారు. ఈ రెండూ కాక ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా వుంటుందని గ్యాసిప్ లు వున్నాయి. ప్రస్తుతం రాథేశ్వామ్ సినిమా ఫినిష్ చేయాల్సి వుంది. అలాగే యష్ రాజ్ ఫిలింస్ కు కూడా ఓ సినిమా చేస్తారని టాక్ వుంది.
ఈ లెక్కన ఇక ప్రభాస్ తెలుగు నిర్మాతలు మైత్రీ మూవీస్, దిల్ రాజులకు సినిమా చేసే అవకాశాలు లేనట్లే.