హిందువుల మనోభావాలను బీజేపీ నేతలు దెబ్బతీశారని ఎక్కడైనా విన్నామా? కన్నామా? ఇదే కలికాలానికి మించిన కాలం…కరోనా కాలం మహత్యం. బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారనే ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంత కాలంగా ఆమె బీజేపీ కార్యకలాపాల్లో కూడా సీరియస్‌గా ఉండడం లేదు.
ఇటీవల మాధవీలత తన ఫేస్‌బుక్ పేజీలో, “హిందూ దర్మం దాని రక్షణ అని పిసుక్కునే ఫేస్బుక్ హిందూ ధర్మ రక్షకులకి, వీరాది వీరులకి ,శూరులకి, దొంగ భక్తులకి నా విన్నపం” అంటూ ఓ వీడియోను షేర్ చేసి చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె ఘాటైన పదజాలాన్ని వాడారు.
“అబలవి. చేతకానిదానివి, డబ్బులేని దానివి, పదవిలేని దానివి, రాజరిక కుటుంబ నేపథ్యం లేనిదానివి కనుక బలహీనురాలివి కనుక మా యొక్క జ్ఞానం లేని దొంగ హిందూ భక్తి ని నీ మీద చూపిస్తాం అంటే చాలా సంతోషం.
May God Bless you అని తనలోని ఆవేదనంతా ఫేస్‌బుక్‌లో ప్రదర్శించారు. బహుశా ఇదే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాధవీలత కామెంట్ పెట్టారనే ఫిర్యాదుకు కారణమై ఉంటుంది.
మాధవీలతపై కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో మాధవీలత చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఫేస్‌బుక్‌లో కవిత్వం, చిన్నచిన్న వ్యాసాలను రాస్తూ తన మనోభావాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ముక్కుసూటి తనమే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది.
ఫేస్‌బుక్‌లో మాధవీలత హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా కామెంట్ పెట్టారని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా కామెంట్ చేశారనే ఫిర్యాదుపై సినీ క్రిటిక్, నటుడైన కత్తి మహేశ్‌పై కూడా ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు.
ఈ నేపథ్యంలో మాధవీలత అరెస్ట్, జైలు జీవితం తప్పదా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండడం గమ నార్హం. చట్టానికెవరూ అతీతులు కారని అని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ వ్యవహారంలో పోలీసులు చర్యలు తీసుకున్నట్టే…మాధవీలత కేసును కూడా సీరియస్‌గా తీసుకుంటే మాత్రం అరెస్ట్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో మరి.