‘హార్స్ ట్రేడింగ్’ మీదనే కమలం ఆశలు!

ఏమిటి కమలనాథుల్లో ఇంత ధైర్యం. ఒకేసారి ఫలితాలు వెలువడిన రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త ప్రభుత్వం పదవీ స్వీకార ప్రమాణం చేయడం కూడా అయిపోయింది. అదే సమయంలో.. మహారాష్ట్రంలో ఇంకా వ్యవహారం ఒక కొలిక్కి…

ఏమిటి కమలనాథుల్లో ఇంత ధైర్యం. ఒకేసారి ఫలితాలు వెలువడిన రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త ప్రభుత్వం పదవీ స్వీకార ప్రమాణం చేయడం కూడా అయిపోయింది. అదే సమయంలో.. మహారాష్ట్రంలో ఇంకా వ్యవహారం ఒక కొలిక్కి రానేలేదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. తమ మిత్రపక్షానికి పరిమితంగా సీట్లు కేటాయించి.. ‘సేఫ్’గా ఎన్నికలకు దిగే ధైర్యం వారు చేయలేకపోయారు. మిత్రపక్షంలో.. తమ నాయకత్వం పట్ల నమ్మకం కలిగించలేకపోయారు. కనీసం బలం సమృద్ధిగా (తమకు గత్యంతరం లేనంతగా) ఉన్న వారి డిమాండును గౌరవించి అధికారాన్ని పంచుకోవడానికి కూడా సిద్ధపడలేకపోతున్నారు. అందుకే మహారాష్ట్రంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఒక సస్పెన్సుగానే ఉంది.

భాజపా-శివసేన కలిసి పోటీచేశాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూడా కలిసి పోటీచేశాయి. ఒక పార్టీ సొంతంగా అధికారం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో శివసేన మునగ చెట్టెక్కి కూర్చుంది. తమకు రెండున్నరేళ్ల అధికారం ఇవ్వకుంటే జట్టు నుంచి తప్పుకుంటాం అంటోంది. ఎన్నికలకు ముందే అది ఒప్పందం అని వారంటుండగా.. అలాంటిదేం లేదని భాజపా చెబుతోంది.

తమాషా ఏంటంటే.. రెండున్నరేళ్ల అధికారం కూడా.. ప్రథమార్థంలో కావాలనేది శివసేన పట్టుదల. పేరుకు మిత్రపక్షాలే అయినప్పటికీ.. వారి మధ్య అంతగా అపనమ్మకం ప్రబలిపోయిఉంది. సెకండ్ హాఫ్ అడిగితే.. ఇస్తారో లేదో అనే అనుమానం ఉంది. ఫడ్నవీస్ మాత్రం.. వచ్చేది కమలం ప్రభుత్వమే, అయిదేళ్లూ పాలించేది మేమే.. అని అంటున్నారు. ఏ ధీమాతో వారు శివసేన డిమాండ్‌ను ఖాతరు చేయడంలేదో అర్థంకావడం లేదు.

భాజపాకు 105 సీట్లు వచ్చాయి. మిత్రపక్షం శివసేనకు 56. ప్రత్యర్థి కూటమిలో ఉన్న ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు కనిష్టంగా 44 వచ్చాయి. భాజపాను కాదనుకుంటే.. శివసేన కాంగ్రెస్ కూటమితో వెళ్లాలి. రెండు పార్టీలను సంతృప్తి పరచాలి. ‘మీరు ఏ డీల్ తో వచ్చినా ఓకే’ అంటున్న కాంగ్రెస్ కంటె.. బలంగా ఉన్న ఎన్సీపీని కూడా ప్రసన్నం చేసుకోవాలి. అడిగితే వారికి కూడా రెండున్నరేళ్ల పదవిని పంచాల్సి వస్తుంది. భాజపా లేని ప్రభుత్వమే కావాలి గనుక.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీటుకోసం పట్టుపట్టకపోతే అలా జరుగుతుంది.

కానీ భాజపా ఎందుకు ధీమాగా ఉంది. శివసేన ఎంత ఘాటుగా డిమాండు చేస్తున్నప్పటికీ.. ప్రత్యర్థి కూటమితో కలిసి వెళ్లడం వారికి ఆత్మహత్యా సదృశమేననే నమ్మకం కమలానికి ఉంది. పరిస్థితులు వికటిస్తే.. అవసరమైతే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ప్రత్యర్థి కూటమి నుంచి తమవైపు లాక్కోవడానికి కూడా భాజపా వ్యూహరచన చేస్తుండవచ్చు. అందుకే.. నిమ్మళంగా ధీమాగా ఉన్నదని.. చిన్న పార్టీలను లోబరచుకోవడం, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు మరల్చుకోవడానికి కూడా భాజపా సిద్ధంగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..