కైలాస పురుష పుంగవుడు నిత్యానంద మామూలోడు కాదు. ఆయన గారి లీలలు చూడతరం కావడం లేదు. ఆధ్యాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందిన నిత్యానంద గుట్టు రట్టు అయ్యే సరికి దేశం విడిచాడు. ఆ తర్వాత కైలాస వాసిగా సరికొత్త అవతారం ఎత్తాడు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అని నామకరణం చేసినట్టు అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు నిత్యానంద లేటెస్ట్ అప్‌డేట్‌కు వస్తే…దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త నుంచి ఆర్థికవేత్తగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తన దేశంలో కైలాస రిజర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తాజా ప్రకటన సారాంశం. ఇప్పటికే తన దేశానికి పాస్‌పోర్ట్, ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. అంతేకాదు, ప్రత్యేక కేబినెట్ ఏర్పాటుతో స్వయం పాలన సాగిస్తున్నట్టు నిత్యానంద ప్రకటించి ఔరా అనిపించారు.
ప్రస్తుతానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక కరెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ కరెన్సీ ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా వివిధ దేశాలతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ కరెన్సీని చెలామణిలోకి తెచ్చేందుకు ఓ శుభముహూర్తాన్ని కూడా నిర్ణయించారు.
గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ నెల 22న హిందూ రిజర్వ్ బ్యాంక్‌ను స్థాపించడంతో పాటు అదే రోజు నుంచి కైలాస కరెన్సీని అందుబాటులోకి తీసుకరానున్నట్టు ప్రకటించారు. ఇదేదో గాలి మాటగా చెబుతున్నది కాదండోయ్. అన్నీ చట్టబద్ధంగా సాగుతున్నట్టు కైలాస విలాస పురుషుడు చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంలో నిత్యానంద ఫోటోలతో అచ్చైన కరెన్సీ నోట్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా నిత్యా నంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఫిబ్రవరిలో బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. అయినా నిత్యానందను భారత్‌కు తీసుకొచ్చే మార్గం కనిపించడం లేదు. మరోవైపు విలాసపురుషుడు నిత్యానంద తన పని తాను చక్కగా చేసుకుంటూ పోతున్నారు. మున్ముందు ఇంకా ఎన్నెన్ని మాయలు చేస్తాడో చూడాలి మరి. ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడో?