ఒక ఊళ్లో ఒక ప్రముఖ వైద్యుడు వుండేవాడు. బాగా వృద్ధాప్యం వచ్చాక ఏ ఆలోచన వచ్చిందో ఏమో ఎలిసా అనే ఒక అందమైన యువతిని పెళ్లాడాడు. ఆమెకు మంచి బట్టలు, నగలు కొనిపెట్టి బాగా చూసుకుంటున్నానని అనుకున్నాడు కానీ ఆమెకు ఆ వయసులో కావలసిన శయ్యాసుఖాన్ని తగినంతగా యివ్వలేకపోవడంతో ఆమె అసంతృప్తిగా వుండేది. అది గ్రహించిన డాక్టరు పిల్లలు పుట్టాలంటే తరచుగా ఉపవాసాలు చేయాలని, దేవతలకు మొక్కాలని బలవంతం చేసేవాడు. రమించే ఓపిక లేకనే తనకిలా బోధిస్తున్నాడని ఆమె త్వరలోనే గ్రహించింది. ఇతనితో పని కాదని బయట ఎవరైనా అందమైన కుర్రవాడు దొరుకుతాడాని వెతికింది.
ఎలిసా కృషి ఫలించి, రగ్గియోరీ అనే ఒక అందగాడు దొరికాడు. మంచి కుటుంబానికి చెందినవాడే కానీ దుస్సాంగత్యంతో చెడిపోయాడు. అప్పులపాలై పోయి, చిల్లరమల్లర తగాదాలలో చిక్కుకుని, పరువుతక్కువ పనులు చేసి పోకిరిగా పేరుపడ్డాడు. బంధుమిత్రులందరూ అతన్ని దూరం పెట్టారు. ఇవన్నీ తెలిసి కూడా ఎలిసా అతనంటె యిష్టపడింది. తన పనిమనిషి సహాయంతో అతనికి కబురు పంపింది. అతనూ సరేనన్నాడు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుని సుఖించసాగారు. నీ పద్ధతులు మార్చుకో అని హితబోధలు చేస్తూ, పాత అప్పులు తీర్చడానికి అప్పుడప్పుడు డబ్బు ముట్టచెబుతూ అతన్ని మరింత చేరువ చేసుకుందీమె.
ఈ వ్యవహారం యిలా నడుస్తూండగా ఒకతను కాలి బాధతో ఎలిసా భర్త వద్దకు వచ్చాడు. గాంగ్రీన్ వచ్చి కాలిలో చాలా భాగం కుళ్లిపోయింది. దాన్ని ఆపరేషన్ చేసి తీసేయకపోతే మొత్తం కాలు తెగ్గొట్టేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసేటప్పుడు బాధ భరించాలంటే రోగికి మత్తుమందు యివ్వాలి. సాయంత్రం ఆపరేషన్ అనగా మధ్యాహ్నానికి మందులషాపతనికి చెప్పి నల్లమందు తెప్పించాడు డాక్టరు. దాన్ని ఒక గ్లాసులో రంగరించి మత్తుమందు తయారుచేసుకుని, సరిగ్గా క్లినిక్కు బయలుదేరే సమయంలో వేరే వూరి నుంచి ఒకతను వచ్చి అక్కడ కొట్లాట జరిగిందని, చాలామందికి దెబ్బలు తగిలాయని, వెంటనే వున్నపళంగా రమ్మనమని అడిగాడు. దాంతో డాక్టరు రోగి బంధువులకు ‘ఆపరేషన్ రేపు చేద్దాం’ అని చెప్పేసి, అతనితో పొరుగూరు వెళ్లాడు. వెళ్లేటప్పుడు మత్తుమందు ద్రావకం వున్న గ్లాసును బెడ్రూములో వున్న కిటికీ అంచులో పెట్టేసి వెళ్లాడు. దాన్ని ముట్టుకోవద్దని భార్యకు చెప్పడం మర్చిపోయాడు.
భర్త ఆ రాత్రికి తిరిగి రాడని ఎలిసాకు అర్థం కాగానే ప్రియుణ్ని యింటికి రప్పించుకుంది. సద్దు మణిగి, తక్కిన పనివాళ్లందరూ విశ్రమించేదాకా తన పడగ్గదిలో వుండమని చెప్పి బయటనుంచి గొళ్లెం పెట్టింది. కాస్సేపటికి రగ్గియోరీకి దాహం వేసింది. బయటకు వెళ్లడానికి వీల్లేదు. కిటికీలోని గ్లాసులో మంచినీళ్లున్నాయి కదాని గడగడా తాగేశాడు. అతను నీళ్లనుకున్నది మత్తుమందు ద్రావకం కావడంతో గాఢనిద్ర పట్టేసి, మంచం మీద దుంగలా పడిపోయాడు. కాస్సేపటికి ఎలిసా వచ్చి లేపబోయింది. లేవకపోయేసరికి, కోపావేశాలతో ‘‘లేవరా నిద్రమొహమా, అంతగా నిద్ర పోవాలంటే మీ యింటికెళ్లి పడుక్కోవాల్సింది, ఏం ఉద్ధరిద్దామని యిక్కడకు వచ్చావ్?’’ అంటూ ఒక్క తోపు తోసింది.
దాంతో దబ్బున అతను నేలమీద పడ్డాడు. అయినా చలనం లేదు. ఎలిసాకు కంగారు పుట్టింది. గిల్లింది, రక్కింది, కొరికింది, ఏం చేసినా మనిషి కదల్లేదు, మెదల్లేదు. కొంపదీసి చచ్చిపోయాడా అని అనుమానం వచ్చింది. వెళ్లి పనిమనిషిని వెంటపెట్టుకుని వచ్చింది. ఆమె వచ్చి చూసి వీడు టపా కట్టేశాడు అంది. ‘అంత హఠాత్తుగా ఎలా పోతాడే?’ అంది ఎలిసా. ‘ఏమోనమ్మా, అన్నీ పాడు అలవాట్లు, ఎలాటి రోగాలు తగిలించుకుని తగలడ్డాడో ఏమో, పోయిపోయి యిక్కడ చచ్చాడు. తెల్లవారి ఎవరైనా చూస్తే ఎంత అప్రతిష్ఠ! ఈ శవాన్ని యిక్కణ్నుంచి తీసిపారేయకపోతే మీ రంకు బయటపడిపోతుంది కదా’’ అంది.
ఎలిసా కూడా అదే అనుకుంది. ‘‘ఏదైనా ఉపాయం చూడు. ఈ శవం మనింట్లో కనబడకుండా వుంటే అంతే చాలు.’’ అంది. పనిమనిషి కాస్సేపు ఆలోచించి ‘‘మన యింటి పక్కన వడ్రంగి అతను వుంటాడు కదా. ఇవాళ సాయంత్రమే అతనింటి ముందు పెద్ద భోషాణం ఒకటి చూశాను. ఎవరో ఆర్డరిస్తే తయారుచేసి వుంటాడు. ఈ శవాన్ని తీసుకెళ్లి ఆ పెట్లో పెట్టి వీధిలో పడేశామంటే సరి. ఎవరో చంపేసి పెట్టెలో పెట్టారని అనుకుంటారు. ఇతనికి చాలామందితో తగాదాలు వున్నాయి కాబట్టి వాళ్లలో ఎవరో ఒకరు యితన్ని చంపేసి వుంటారని అనుకోవడానికి ఆస్కారం వుంది. మీతో వ్యవహారం నడుస్తోందని ఎవరికీ అనుమానం రాదు.’’ అంది. ‘‘కావాలంటే ఓ బాకు తీసుకుని, నాలుగైదు చోట్ల పొడిచేస్తే సరి, పోట్లాట జరిగిందా లేదాని ఎవరికీ అనుమానమే రాదు.’’ అని సూచించింది కూడా.
‘‘తక్కినదంతా బాగానే వుంది కానీ బాకుతో పొడవ్వద్దు. నేను భరించలేను. పీక పిసికి చంపేశారని అనుకుంటారులే.’’ అంది ఎలిసా. తర్వాత పనిమనిషి యజమానురాలి సహాయంతో ‘శవాన్ని’ భుజానికి ఎత్తుకుని వీధిలోకి నడిచింది. ఆమెకు ముందుగా మొహానికి ముసుగు వేసుకుని ఎలిసా నడిచింది. ఎవరూ కనుచూపుమేరలో లేరని నిశ్చయించుకున్నాక భోషాణం తలుపు తెరిచి పెట్టింది. పనిమనిషి శవాన్ని లోపలకి జార్చింది. ఇద్దరూ కలిసి బతుకు జీవుడా అనుకుంటూ యింట్లోకి వచ్చి తలుపు వేసుకున్నారు. ఎలిసా తన ప్రియుడి దుర్మరణాన్ని తలుచుకుని బాధపడుతూ రాత్రి గడిపింది.
ఆ వీధిలోనే నాలుగిళ్ల అవతల యిద్దరు వడ్డీ వ్యాపారస్తులున్నారు. మహా లోభులు. ఇంట్లోకి సామాను కొనాలను కుంటూండగానే వారి కంట యీ భోషాణం పడింది. కొనడమెందుకు? వీధిలోనే పడి వుంది కదా, అర్ధరాత్రి ఎత్తుకు వచ్చేస్తే సరి, మనింటికి ఎవరు వచ్చి చూస్తారు? అనుకున్నారు. అలాగే ఆ రాత్రి ఎవరూ లేనప్పుడు తమ యింటికి మోసుకుని వచ్చేశారు. ‘బాగా బరువుంది. నాణ్యమైన చెక్కతో చేసి వుంటాడు’ అనుకుని సంతోషిస్తూ యింట్లోకి రాగానే సావిట్లో దింపేసి, లోపలి గదిలోకి వెళ్లి పడుక్కున్నారు. ఆ సావిడికి పక్కనే ఆడవాళ్లు పడుక్కునే గది వుంది.
కొన్ని గంటలు గడిచేసరికి రగ్గియోరీకి మత్తు దిగింది. మెలకువ వచ్చి చూస్తే అంతా చిమ్మ చీకటి. తడిమి చూడబోగా తను పెట్టె లోపల వున్నట్లు తెలిసింది. ఇదేమిటి? దీనిలోకి ఎలా వచ్చాను అనుకున్నాడు. తల విదిలించినా ఏదీ గుర్తు రాలేదు. అంతా మత్తుమత్తుగా, అయోమయంగా వుంది. కాస్సేపు అలాగే పడుకుని ఆలోచిస్తే బహుశా డాక్టరుగారు యింటికి అనుకోకుండా తిరిగి వచ్చి వుంటాడు, అందుకే ఎలిసా తనను యీ పెట్టెలో దాక్కోమని వుంటుంది అని తోచింది. కానీ ఏదీ స్పష్టంగా గుర్తు లేనందుకు ఆశ్చర్యపడ్డాడు. ఏది ఏమైనా కదలకుండా, మెదలకుండా పడి వుండడమే మేలు, లేకపోతే గుట్టు రట్టవుతుంది అనుకున్నాడు.
ఎంతసేపైనా ఏ అలికిడీ వినబడకపోవడంతో కంగారు పుట్టింది. పైగా భోషాణం యిరుగ్గా వుండడంతో ఒళ్లు తీపులు పెట్టింది. లేచి కూర్చోబోయాడు. ఆ భోషాణం నేల మీద సరిగ్గా ఆనినట్లు లేదు. ఇతను వీపు భోషాణం గోడకు ఆన్చగానే పెద్ద శబ్దంతో అది ఓ పక్కకు పడిపోయింది. ఇతను భయపడిపోయి, మూత తోసుకుని బయటకు వచ్చేసి, పారిపోవడానికి గుమ్మం కానీ, మెట్లు కానీ కనబడుతుందాని వెతకసాగాడు. శబ్దానికి పక్కగదిలో పడుక్కున్న మహిళలు నిద్రలేచి ‘‘ఎవరది?’’ అని అరవసాగారు. లోపల పడుక్కున్న యువకులిద్దరికి మెలకువ రాకపోవడంతో సావిట్లోకి రాలేదు. మగవాళ్లెవరూ దగ్గర్లో లేరన్న భయంతో ఆడవాళ్లందరూ ఒక్కపెట్టున ‘‘దొంగలు, దొంగలు’’ అని అరవడం మొదలెట్టారు.
ఆ కేకలకు యిరుగుపొరుగువాళ్లు లేచి వచ్చేశారు. యువకులు కూడా లేచి చుట్టుముట్టారు. రగ్గియోరీ బిత్తరపోయాడు. అసలీ యిల్లు ఎవరిదో, తను యిక్కడికి ఎలా వచ్చాడో ఏమీ అర్థం కాలేదతనికి. అయోమయంగా చూస్తూండగానే రక్షకభటులు వచ్చి పట్టుకుని పోయారు. మర్నాడు మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు. ఆ మేజిస్ట్రేటు మహా కర్కోటకుడు. ఖైదీలను చిత్రహింసలు పెట్టి చేయని నేరాలు కూడా ఒప్పించగల ఘనుడు. అతని ధాటికి దడిసి రగ్గియోరీ తను వడ్డీవ్యాపారస్తులు యింటికి దొంగతనానికి వెళ్లానని ఒప్పేసుకున్నాడు. ఆ కారణంగా అతనికి ఉరిశిక్ష పడింది.
మర్నాడు ఉదయమే యీ వార్త విని ఎలిసా, పనిమనిషి దిగ్భ్రాంతులయ్యారు. చనిపోయాడనుకున్న రగ్గియోరీ దొంగగా ఎలా తేలాడో వాళ్లకు అర్థం కాలేదు. మధ్యాహ్నానికల్లా డాక్టరు తిరిగిరావడం, ఆపరేషన్ చేయబోతూ మత్తుమందు కోసం యింటికి కబురంపితే ఖాళీ గ్లాసు వెక్కిరంచడం, అగ్గిరాముడై భార్యను తిట్టడంతో అది మత్తుమందని ఎలిసాకు తెలిసింది. తన ప్రియుడు మూర్ఛిల్లడానికి, చనిపోయినట్లు తోచడానికి కారణమేమిటో బోధపడింది. ఇంతలో పనిమనిషి బజారు నుంచి తిరిగి వచ్చి రగ్గియోరీ బంధుమిత్రులందరూ మొహం చాటేశారని, అతని తరఫున ఒక మంచిమాట చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి రాలేదని చెప్పింది. ఇది విని ఎలిసా వ్యథ చెందింది.
ఆమె ఆ స్థితిలో వుండగానే పనిమనిషి ‘మీకో తమాషా చెప్తాను వినండి. నేను తిరిగి వస్తూంటే ఒక పెద్దమనిషి మన యింటిపక్కనున్న వడ్రంగితో పోట్లాడుతున్నాడు. ‘భోషాణం చేయడానికి నా దగ్గర డబ్బు పుచ్చుకుని, దాన్ని నాకివ్వకుండా ఆ వడ్డీ వ్యాపారస్తులకు అమ్మేస్తావా? తక్షణం ఆ డబ్బు కక్కు’ అంటున్నాడు. దానికి ఆ వడ్రంగి ‘నేనెవ్వరికీ అమ్మలేదు. రాత్రి మా గుమ్మంలోంచి ఎవరో ఎత్తుకుని పోయారు.’ అన్నాడు. ఆ పెద్దమనిషి ‘అబద్ధం. ఇవాళ ఎవడో దొంగ దొరికాడని విని, వాణ్ని చూడడానికి వడ్డీవ్యాపారస్తుల యింటికి వెళ్లాను. అక్కడ నేను చేయించిన భోషాణం కనబడింది. ఇది నాది, మీకెలా వచ్చిందని అడిగితే నీ దగ్గర కొనుక్కున్నామని వాళ్లు చెప్పారు.’ అంటున్నాడు. ‘నువ్వేనా అబద్ధం చెప్తూండాలి, వాళ్లయినా అబద్ధం చెప్తూండాలి. పద వెళ్లి అడుగుదాం’ అన్నాడు వడ్రంగి. ఇద్దరూ అటు వెళ్లారు, నేను యిటు వచ్చాను.’’ అని చెప్పింది.
జరిగిందేమిటో ఎలిసాకు సర్వం అర్థమైంది. తన కోసం వచ్చినవాడు తన పొరపాటు వలన ఉరికంబ మెక్కబోతున్నాడన్న పాపభీతి ఆమెను దహించివేసింది. పనిమనిషితో ‘‘అతని ప్రాణం, నా పరువు రెండూ కాపాడగల సమర్థురాలివి నీవే. అతను చచ్చిపోతే ఆ పాపంలో నీకూ పాలుంటుంది. బతికున్నవాణ్ని నిష్కారణంగా భోషాణంలో పడేసి యిక్కట్లపాలు చేశాం. నేను చెప్పినట్లు చేస్తే నీకు ఎన్నో బహుమతులిస్తాను.’’ అని నచ్చచెప్పింది.
పనిమనిషి ఒప్పుకుంది. డాక్టరు దగ్గరకు వెళ్లి ‘‘నా వలన ఒక పొరపాటు జరిగింది. ఈ రగ్గియోరీ అనే అతను నా ప్రియుడు. రెండు నెలలుగా నా వెంట పడుతున్నాడు. నిన్న రాత్రి మీరు యింట్లో లేని సమయం చూసి మీ పడకగదికి రప్పించి దాచి వుంచాను. అంతలో అతను దాహం వేసిందన్నాడు. వెళ్లి మద్యం తేవాలంటే హాలులో అమ్మగారి కంటపడతాను. కిటికీలో వున్న గ్లాసులోవి మంచినీళ్లే కదాని అతనికిచ్చాను. అది మీరు తయారుచేసుకున్న మత్తుమందని నాకు తెలియదు. అతను స్పృహ తప్పడంతో చచ్చిపోయాడని భయపడి, వీధిలో ఉన్న భోషాణంలో పడేశాను. తీరా చూస్తే అతన్ని దొంగ అంటున్నారు. మీరు నా తప్పు కాయాలి. నా అపరాధం వలన ఒక నిర్దోషి చచ్చిపోతున్నాడన్న అపరాధభావన తొలిచివేస్తోంది. తప్పు చేయనివారుండరు. క్షమించండి.’’ అని బతిమాలింది.
డాక్టరుకు ఉవ్వెత్తున కోపం వచ్చింది. నీ పాడు వ్యవహారాలేవో బయటు ఏడవకుండా, నా యింటికే తీసుకొచ్చేటంత తెగింపు ఎలా వచ్చిందంటూ పనిమనిషిని బాగా తిట్టి, ఆపై చల్లారి, ‘వెళ్లి మాజిస్ట్రేటుని కలిసి జరిగింది చెప్పు. మత్తుమందు గురించి సాక్ష్యం చెప్పమంటే నేను వచ్చి చెప్తానులే.’’ అన్నాడు. ఆ తర్వాత పనిమనిషి ఖైదులో వున్న రగ్గియోరీని కలిసి అతనేం చెప్పాలో తర్ఫీదు యిచ్చింది. ఆ తర్వాత మేజిస్ట్రేటును కలిసి తన కథనం వివరించింది. వడ్రంగికి, భోషాణం చేయించిన పెద్దమనిషికి జరిగిన వాగ్వివాదం గురించి కూడా చెప్పింది.
మేజిస్ట్రేటు అందర్నీ రప్పించి, ప్రశ్నలడిగాడు. డాక్టరు గారి యింట్లో పనిమనిషి కోసమే వాళ్లింటికి వెళ్లానని రగ్గియోరీ చెప్పుకున్నాడు. వడ్డీవ్యాపారస్తులు భోషాణాన్ని దొంగిలించడం చేతనే రగ్గియోరీ వాళ్లింట్లో తేలడం సంభవించిందని అర్థం చేసుకున్న మేజిస్ట్రేటు వడ్డీ వ్యాపారస్తులకు జరిమానా వేసి, రగ్గియోరీని విడుదల చేసేశాడు. ఆ సందర్భంగా ఎలిసా అతనికి పార్టీ యిచ్చింది. ప్రేమికులిద్దరూ పనిమనిషికి ధన్యవాదాలు చెప్పారు. ‘నేను బాకుతో పొడిస్తే బాగుండునని సలహా యిచ్చినా అమ్మగారు వినలేదు. విని వుంటే ఈ పార్టీ వుండేది కాదు’ అంది పనిమనిషి. ముగ్గురూ పగలబడి నవ్వారు. గతంలో తను చేసిన జులాయి పనులకు మృత్యువు కోరలకు దగ్గరగా వెళ్లేంత శిక్ష పడిందని గ్రహించిన రగ్గియోరీ ఆపై బుద్ధిగా వున్నాడు. అంటే ఎలిసాతో రహస్య వ్యవహారం మానేశాడని కాదు. అది యింకా వర్ధిల్లింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2020)
[email protected]